
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం: నారా లోకేష్
రాష్ట్రంలో చిన్నపిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా ప్రవేశాన్ని నిరోధించే విధంగా సమగ్ర విధివిధానాలు రూపొందించి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నపిల్లలు సున్నితమైన, హానికరమైన కంటెంట్‌కు గురికాకుండా రక్షించటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళలపై అవమానకరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిల్లల డిజిటల్ భద్రత, మానసిక వికాసం దృష్ట్యా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ దేశాల్లో అమలవుతున్న నియంత్రణ విధానాలను పరిశీలించి రాష్ట్రానికి అనుకూలంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావంపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. “నో బ్యాగ్ డే” కార్యక్రమాలు, పాఠశాలల్లో నిర్వహించే మెగా పిటిఎ సమావేశాల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల భద్రత దృష్ట్యా స్వయంసహాయ సంఘాల మహిళలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
వయస్సు నిర్ధారణ కోసం డిజిలాకర్ ఆధారిత ‘ఏజ్ టోకెన్’ విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం కేంద్ర చట్ట పరిధిలోకి వచ్చే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఐటి చట్టంలోని సెక్షన్–46 కింద న్యాయ నిర్ణయాధికారిని తక్షణమే నియమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు, సైబర్ క్రైమ్ విభాగ ప్రతినిధులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
