Let's talk: editor@tmv.in
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం సరిపోతుందా?

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం సరిపోతుందా?

Pinjari Chand
9 మార్చి, 2026

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇటీవల 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు అపార్ట్‌మెంట్‌ తొమ్మిదో అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ ముగ్గురు బాలికలు ఒక కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలైనట్లు తేల్చారు. ఈ బాలికలు కొరియన్ గేమ్స్, కే-పాప్, కే-డ్రామాలపై తీవ్ర ఆసక్తి పెంచుకున్నట్లు కూడా దర్యాప్తులో తెలిసింది. వారు సోషల్ మీడియాలో తమ పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకున్నారు. ఈ సంఘటన జరిగింది వారు నివాసం ఉండే భారత్ సిటీ అపార్ట్‌మెంట్ సముదాయంలో. తెల్లవారుజామున ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బాల్కనీ నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మళ్లీ సోషల్ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్ పై ముమ్మరంగా చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వాలు కూడా వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు.

ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ల విస్తరణతో పిల్లలు చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అదే సమయంలో అశ్లీల కంటెంట్‌, ప్రమాదకర ఆన్‌లైన్ గేమ్స్‌, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరమా? అనే చర్చ మళ్లీ ముందుకు వచ్చింది.

నిషేధం ఒక్కటే పరిష్కారం కాదు

పిల్లలకు పూర్తిగా సోషల్ మీడియా నిషేధం విధించడం సమస్యకు పూర్తి పరిష్కారం కాదని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిషేధం ఉన్నప్పటికీ పిల్లలు ఇతరుల ఫోన్లు లేదా ఫేక్ ఖాతాల ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు చదువు, సమాచారం పొందడం, సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధి కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా అవసరమే అని పేర్కొంటున్నారు. అసలు సమస్య పర్యవేక్షణ లోపం, కంటెంట్ నియంత్రణ లేకపోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పేరెంటల్ కంట్రోల్ వ్యవస్థలు, వయస్సు ధృవీకరణ విధానం, ప్రమాదకర కంటెంట్‌పై కఠిన నియంత్రణ, డిజిటల్ లిటరసీపై అవగాహన పెంచడం అవసరమని చెబుతున్నారు.

అశ్లీల కంటెంట్‌పై ఆందోళన

ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్న అశ్లీల వీడియోలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. సోషల్ మీడియా ఖాతాలు తెరవడానికి వయస్సు ధృవీకరణ తప్పనిసరి చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్ ఫిల్టరింగ్ వ్యవస్థలు అమలు చేయడం ద్వారా ఇలాంటి కంటెంట్‌ను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు పేరెంటల్ కంట్రోల్ యాప్స్‌ ద్వారా పిల్లల ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లపై కఠిన నియంత్రణలు విధించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.

ప్రమాదకర గేమ్స్‌.. పెరుగుతున్న ముప్పు

ఇటీవల కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ముఖ్యంగా బ్లూవేల్ ఛాలెంజ్, స్క్విడ్ గేమ్ ఛాలెంజ్‌ వంటి గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాయి. ఈ గేమ్స్‌లో పిల్లలకు ప్రమాదకరమైన లేదా ఆత్మహత్యకు ప్రేరేపించే టాస్కులు ఇవ్వడం వల్ల అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి గేమ్స్‌ను వెంటనే బ్లాక్ చేయడం, సైబర్ క్రైమ్ పర్యవేక్షణను బలోపేతం చేయడం, పిల్లలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. 13 నుంచి 17 ఏళ్ల వయసు గల పిల్లల్లో సుమారు 30–35 శాతం మందికి మానసిక ఒత్తిడి పెరిగిందని అంచనాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ బులీయింగ్‌, సోషల్ మీడియా వ్యసనం కారణంగా ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు 3–4 గంటలకుపైగా సోషల్ మీడియా వినియోగం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ఇతర దేశాల్లో నియంత్రణలు

పిల్లల రక్షణ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టాయి. అస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన పరిమితులు అమలులో ఉన్నాయి. ఫ్​రాన్స్‌లో 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. చైనాలో గేమింగ్‌, సోషల్ మీడియా వినియోగానికి సమయ పరిమితులు విధించారు. అలాగే యూకేలో ఆన్‌లైన్ సేఫ్టీ చట్టాల ద్వారా పిల్లల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

భారత్‌లో పరిస్థితి

ఇండియాలో ఇప్పటివరకు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం అమలులో లేదు. అయితే డిజిటల్ భద్రత, డేటా రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలను అమలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ప్రమాదకర గేమ్స్‌పై పోలీసు పర్యవేక్షణ పెంచగా, మహారాష్ట్రలో స్కూళ్లలో డిజిటల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సైబర్ సేఫ్టీపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.

సమగ్ర చర్యలే మార్గం

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి రక్షించాలంటే కుటుంబం, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ, స్క్రీన్ టైమ్ నియంత్రణ, స్కూళ్లలో డిజిటల్ భద్రతపై పాఠాలు, ప్రభుత్వ స్థాయిలో కంటెంట్ నియంత్రణ వంటి చర్యలు సమగ్రంగా అమలు చేస్తేనే సమస్యను నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు. పిల్లలకు సోషల్ మీడియా పూర్తిగా నిషేధించడం ఒక్కటే పరిష్కారం కాకపోయినా, కఠిన నియంత్రణలు, అవగాహన, పర్యవేక్షణతోనే భవిష్యత్ తరాన్ని ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.