Let's talk: editor@tmv.in
పిల్లలకు పోషకాహారం అవసరం: రాష్ట్రపతి ముర్ము

పిల్లలకు పోషకాహారం అవసరం: రాష్ట్రపతి ముర్ము

Pinjari Chand
18 మార్చి, 2026

దేశ భవిష్యత్తైన పిల్లలకు పోషకాహారం, నాణ్యమైన విద్య సులభంగా అందుబాటులో ఉండటం అత్యవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పిల్లల భద్రమైన భవిష్యత్తు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో మంగళవారం అక్షయపాత్ర పౌండేషన్‌ ఐదు బిలియన్ భోజనాల పంపిణీ సాధించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సంస్థ సాధించిన విజయాన్ని ఆమె ప్రశంసించారు. పిల్లలకు మంచి విద్య, పోషకాహారం, ఆరోగ్యం, శుభ్రమైన, సురక్షిత వాతావరణం కల్పించడం ద్వారా వారి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ రంగం కలిసి పనిచేస్తేనే భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయగలమని అన్నారు.

విద్య వ్యక్తి జీవితంలో అవకాశాలను నిర్ణయించే ముఖ్య సాధనమని, ఇది శక్తివంతమైన మార్పు సాధనమని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో పిల్లలు పొందే విద్య, నైపుణ్యాలు వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. గత 25 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలను ముర్ము అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం–పోషణ్‌ వంటి పథకాలు పిల్లలను పాఠశాలలకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఈ పథకాల వల్ల విద్యార్థుల చేరిక, హాజరు, కొనసాగింపు పెరిగిందని, వారి అభ్యాస సామర్థ్యం కూడా మెరుగుపడిందని తెలిపారు. అలాగే, నాణ్యమైన, సమగ్ర విద్య అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్‌ లక్ష్యాల సాధనలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాణకర్తలని, వారికి అందుతున్న పోషకాహారం దేశ మానవ వనరులపై పెట్టుబడిగా మారుతుందని రాష్ట్రపతి అన్నారు. ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన పిల్లలే 2047 నాటికి ‘వికసిత భారత్’ సాధనలో కీలక పాత్ర పోషిస్తారని ఆమె తెలిపారు.