Let's talk: editor@tmv.in
పిపిపిపై టీడీపీలోనూ వ్య‌తిరేక‌త‌

పిపిపిపై టీడీపీలోనూ వ్య‌తిరేక‌త‌

FL - BRTH
22 అక్టోబర్, 2025

మెడిక‌ల్ కాలేజీల‌ను పిపిపి విధానంనలో నిర్మించ‌డం పైన వైసీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షులు అనంత వెంక‌ట్రామిరెడ్డి కీల‌క వ్యాఖ్యాలు చేశారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం ప‌ట్ల టీడీపీలోనూ అసంతృప్తి ఉంద‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇచ్చిన‌వారు.. ఇప్పుడు టీడీపీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఉద్య‌మంలా చేపట్టి, చంద్ర‌బాబు త‌న నిర్ణ‌యం వెన‌క్కి తీసుకునేలా ఉద్య‌మించాల‌ని వైసీపీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జాభిప్రాయం ముందు ఎంత‌టివారైనా త‌ల‌వంచాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. గుత్తిలో జ‌రిగిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అనంత వెంక‌ట్రామిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అనంత‌పురం జిల్లాలో ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు డ‌బ్బే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే బెదిరిస్తున్నార‌ని, దౌర్జ‌న్యాల‌కు దిగుతున్నార‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీలో లిక్క‌ర్ మాఫియా య‌థేచ్చ‌గా రెచ్చిపోతోంద‌ని, క‌ల్తీ మ‌ద్యం కార‌ణంగా పేద‌లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నార‌ని అన్నారు. టీడీపీ అనుకూల ప‌త్రిక‌లు, చానెల్ల‌లో వార్త‌లు వ‌స్తున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. టీడీపీపై బుర‌ద క‌డుక్కోవ‌డానికి వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి అన్నారు.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌గానే చంద్ర‌బాబులో భ‌యం మొద‌లైంద‌ని అనంత వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. అందుకే ప్ర‌జ‌ల‌ను వైకుంఠ‌పాళి ఆడొద్దు అంటూ మాట్లాడుతున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌న్న విష‌యం చంద్ర‌బాబుకు అర్థ‌మైంద‌న్నారు. అందుకే వేడుకుంటూ మ‌ళ్లీ త‌న‌నే గెలిపించాల‌ని కోరుతున్నార‌ని అన్నారు. వైసీపీపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు నిద‌ర్శ‌నం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు విజ‌య‌వంతం కావ‌డ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అది చూసి బాబుకు గుబులు ప‌ట్టుకుంద‌ని విమ‌ర్శించారు.

పిపిపిపై టీడీపీలోనూ వ్య‌తిరేక‌త‌ - Tholi Paluku