Let's talk: editor@tmv.in
పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ..రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు

పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ..రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు

Panthagani Anusha
7 ఏప్రిల్, 2026

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన పిఠాపురం రైల్వే స్టేషన్ త్వరలో అత్యాధునిక హంగులతో ప్రయాణికులకు ముస్తాబు కానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఈ స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించి కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా రూ.37.25 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో స్టేషన్‌లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు భక్తులు, ప్రయాణికుల కోసం కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులోకి రానున్నాయి.

సమస్య గుర్తింపు నుంచి పరిష్కారం వరకు

గతంలో పిఠాపురం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ స్థానిక రైల్వే స్టేషన్ పరిసరాల్లో నెలకొన్న అశుభ్రతను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య దుర్గంధంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఆయన తక్షణమే ప్రక్షాళన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం స్థానిక మరమ్మతులతో సరిపెట్టకుండా స్టేషన్‌ను శాశ్వతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత జనవరిలో ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. ఈ భేటీలో పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించి, దీనిని ‘అమృత్ భారత్’ స్కీమ్‌లో చేర్చాలని కోరారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నూతన నిర్మాణాలు

పిఠాపురం నగరానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు తరలివస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా స్టేషన్ ముఖద్వారాన్ని, ప్రధాన భవనాన్ని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా రీ-డిజైన్ చేయనున్నారు. స్టేషన్ ప్లాట్‌ఫాంల విస్తరణ, అత్యాధునిక షెల్టర్లు, ఎలక్ట్రికల్ కేబులింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ వంటి పనులు ఈ అభివృద్ధి పనుల్లో ప్రధానమైనవి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గదులు, పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు.

పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి తక్షణమే స్పందించి నిధులు విడుదల చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.