
పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పిఠాపురం పట్టణంలో నీట మునిగిన పలు ప్రాంతాలను శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత పిఠాపురం పట్టణం కరివేపాకుపేట లో 26 వార్డు లో పర్యటించి నీట మునిగిన గృహాలను పరిశీలించారు. అనంతరం చిట్టోడి దిబ్బ లో 28, 29 వార్డుల్లో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కాలనీల్లో వర్షపు నీటిని బయటకు పంపేందుకు తక్షణం ఏర్పాట్లు చేయాలని, అలాగే పిఠాపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్, 'పడ' అధికారులు సమన్వయంతో పనిచేసి పిఠాపురం నియోజవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సూచించారు. పిఠాపురం ఇంచార్జ్ కమిషనర్ పి.రాజు, మునిసిపల్ అధికారులు, జనసేన నాయకులు కార్యకర్తలు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
