
పిఠాపురంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు అభివృద్ధి వెలుగులు
చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఆలయాల అభివృద్ధి, భజన మందిరాల నిర్మాణం, కల్యాణ మండపం ఏర్పాటుకు మొత్తం రూ.30.66 కోట్ల నిధులు కేటాయించారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా పనులు కొనసాగుతున్నాయి.
24 ఆలయాల అభివృద్ధికి రూ.17.06 కోట్లు
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి రూ.17.06 కోట్లు కేటాయించారు. ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతోపాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నారు. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరుకుంది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. శ్రీ కుంతీమాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం, రామకృష్ణాపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానానికి రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
పురాతన ఆలయాలకు కొత్త రూపు
పునరుద్ధరణకు ఎంపికైన ఆలయాల్లో శతాబ్దాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పిఠాపురంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన 10వ శతాబ్దం నాటి శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంతోపాటు పిఠాపురం మహారాజుల కాలం నాటి పలు పురాతన ఆలయాలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త రూపు తీసుకురానున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలను ఏటా సుమారు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పండుగలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాల సమయంలో రోజుకు 20 వేల నుంచి 50 వేల వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీకి అనుగుణంగా ఆలయాలను ఆధునీకరిస్తున్నారు.
టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు
యు.కొత్తపల్లి మండలంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించారు. వివాహాలు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర సామాజిక అవసరాలకు ఉపయోగపడేలా ఆధునిక వసతులతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపాన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మించడంతోపాటు ఆలయ మాడ వీధుల విస్తరణ పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాకినాడ జిల్లావ్యాప్తంగా 419 భజన మందిరాలను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాల నిర్మాణానికి రూ.11.60 కోట్లు మంజూరయ్యాయి.
