
పావురాలకు మేత వేస్తే రూ.5,000 జరిమానా: ముంబై కోర్టు సంచలన తీర్పు
ముంబైలో బహిరంగ ప్రదేశంలో పావురాలకు మేత వేసినందుకు ఒక వ్యాపారవేత్తను దోషిగా తేల్చిన కోర్టు, అతనికి రూ. 5,000 జరిమానా విధించింది. అతని చర్య వల్ల "ప్రాణాపాయం కలిగించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది" అని కోర్టు అభిప్రాయపడింది.
ముఖ్య విశేషాలు:
ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంతో, ఆరోగ్య సమస్యల దృష్ట్యా, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని చాలా ప్రాంతాల్లో పావురాలకు మేత వేయడాన్ని ఇప్పటికే నిషేధించింది.
కాని దాదర్‌కు చెందిన నితిన్ షేత్ (52) అనే వ్యక్తి, ఆగస్టు 1వ తేదీన మహిమ్ ప్రాంతంలోని మూసివేసిన 'కబుతర్‌ఖానా' (పావురాల మేత కేంద్రం) వద్ద పక్షులకు గింజలు వేశారు. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ నేరంగా పరిగణించి అతనిపై కేసు నమోదుచేసింది. ఆ కేసుపై తీర్పును ముంబై కోర్ట్ శుక్రవారం వెల్లడించింది.
బాంద్రా అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వి.యు మిసల్ ఈ కేసును విచారించారు. నిందితుడు తన తప్పును స్వచ్ఛందంగా అంగీకరించి, శిక్ష తగ్గించాలని కోరడంతో కోర్టు రూ. 5,000 జరిమానా విధించింది.
చట్టపరమైన సెక్షన్లు:
నిందితుడిపై ఈ క్రింది సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 (b) ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం, మానవ ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పు కలిగించే చర్యలు చేయడం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 271 ప్రాణాపాయ వ్యాధులు వ్యాపించేలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం.
నిషేధానికి గల కారణాలు
పావురాలకు మేత వేయడం అనేది మన సంస్కృతిలో పుణ్యకార్యంగా భావించినప్పటికీ, శాస్త్రీయంగా, ఆరోగ్య పరంగా అవి మానవులకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. అందుకే ముంబై వంటి నగరాల్లో వీటిని నిషేధించారు. పావురాల వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు నిషేధానికి గల కారణాలు..
శ్వాసకోశ వ్యాధులు:
పావురాల రెట్టలు ఆరిపోయిన తర్వాత, అవి పొడి పొడి దుమ్ములాగా గాలిలో కలుస్తాయి. ఆ గాలిని మనం పీల్చినప్పుడు ఈ క్రింది వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
హిస్టోప్లాస్మోసిస్:
ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సిట్టకోసిస్:
దీనిని 'ప్యారట్ ఫీవర్' అని కూడా అంటారు. ఇది జ్వరం, దగ్గు, న్యుమోనియాకు దారితీస్తుంది.
క్రిప్టోకోకోసిస్:
ఇది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మెదడు వాపు కి కూడా కారణం కావచ్చు.
అలర్జీలు, ఆస్తమా
పావురాల ఈకలు వాటి శరీరం నుండి వచ్చే పొట్టు వల్ల చాలా మందికి తీవ్రమైన అలర్జీలు వస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆస్తమా ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. వీటివల్ల హైపర్ సెన్సిటివిటీ న్యుమోనిటిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది, దీనినే 'బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్ ' అని కూడా పిలుస్తారు.
ఇతర ఇన్ఫెక్షన్లు
సాల్మొనెలోసిస్అంటే పావురాల రెట్టలు ఆహారం లేదా నీటిలో కలిసినప్పుడు ఈ బ్యాక్టీరియా వల్ల విరేచనాలు వాంతులు అవుతాయి. పావురాల శరీరంలో ఉండే పేలు, నల్లులు మనుషులకు పాకి చర్మ వ్యాధులను కలిగిస్తాయి.
ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
మనం మేత వేయడం వల్ల పావురాలు సహజంగా ఆహారం వెతుక్కోవడం మానేసి, జనావాసాల్లోనే పెరిగిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పైన పేర్కొన్న విధంగా ప్రాణాపాయ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం వల్ల మున్సిపల్ అధికారులు దీనిని ఒక 'ప్రజారోగ్య ముప్పు’ గా పరిగణిస్తున్నారు. పావురాల రెట్టల్లో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది భవనాలు, చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలను కాలక్రమేణా క్షీణింపజేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన వందల సంఖ్యలో పావురాలు ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారుతుంది.
ముంబై కోర్టు తీర్పు ప్రకారం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరం. అందుకే మేత వేయడాన్ని నిషేధించి జరిమానాలు విధిస్తున్నారు.
