Let's talk: editor@tmv.in
పాలార్ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

పాలార్ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

Pinjari Chand
29 అక్టోబర్, 2025

తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పాలార్‌ నది తీర ప్రాంత గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్ర నీటి వనరుల శాఖ ఆదేశాల మేరకు మంగళవారం రాణిపేట్‌ జిల్లాలోని కాంచీపురం కలెక్టర్‌ పాలార్‌ నది ఒడ్డున ఉన్న కాంచీపురం, వలజాబాద్‌, ఉత్తరమేరూర్‌ తాలూకాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పాలార్‌ ఆనకట్ట నుంచి మంగళవారం 10,626 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయడంతో నది ప్రవాహం పెరిగింది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నందున, నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు నదిలోకి దిగకూడదని, దాటకూడదని, స్నానం చేయకూడదని, బట్టలు ఉతకకూడదని సూచించారు. పశువులను కూడా నది ఒడ్డుకు తీసుకెళ్లవద్దని తెలిపారు.

రాష్ట్రంలోని తిరువళ్లూర్‌, చెన్నై, కాంచీపురం, చెంగలపట్టు, డెల్టా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వాతావరణ కేంద్రం సముద్ర తీర ప్రాంతాలకు అరెంజ్‌, యెల్లో అలర్ట్ జారీ చేశారు.

మొంత తుఫాన్‌ బీభత్సం – పాలార్‌ ఉప్పొంగి ముంపులో 30 గ్రామాలు

తుఫాన్‌ ప్రభావంతో కాంచీపురం జిల్లా అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాల కారణంగా పాలార్‌ నది ఉప్పొంగి, వలజాబాద్‌–తిరుపులివానం మధ్య ఉన్న కాజ్‌వే మునిగిపోయింది.

దీంతో 30కి పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర అవసరాల కోసం 20 కి.మీ. మేర ప్రత్యామ్నాయ మార్గం నుంచి తిరగాల్సి వస్తోంది.

ప్రతి సంవత్సరం ఇదే దుస్థితి. వర్షం పడితే మా గ్రామాలు ప్రపంచం నుంచి వేరైపోతాయి. మాకు ఎప్పటికైనా ఒక పెద్దస్థాయి వంతెన నిర్మించాలని వలజాబాద్‌, ఉత్తరమేరూర్‌ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పాలార్‌ నది ప్రవాహం నిరంతరం పెరుగుతుండటంతో అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. వలజాబాద్‌, తిరుపులివానం, మంగళం, మధురాంతకం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

పరిశీలించిన సీఎం స్టాలిన్

ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ చెన్నైలో ఆద్యార్‌ నది పరిసరాలను పరిశీలించి, వర్షానికి సంబంధించిన చర్యలను సమీక్షించారు.

తిరువళ్లూర్‌, చెన్నై, కాంచీపురం, చెంగలపట్టు, డెల్టా జిల్లాల్లో పడుతున్న భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బియ్యం పంపిణీలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులకు సూచించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తదుపరి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

గతంలో వచ్చిన వరదలు, వివరాలు

పాలార్‌ నదికి గతంలో వరదలు వచ్చాయి. అయితే అవి పెద్ద స్థాయి విపత్తులుగా కాకుండా ఓ మోస్తరు ప్రభావం మాత్రమే చూపించాయి.

సాధారణంగా వర్షాకాలంలో కురిసే భారీవర్షాల తర్వాత లేదా డ్యామ్‌ల నుంచి ఆకస్మికంగా నీరు విడుదల చేసినప్పుడే జరుగుతుంది.

1996 – చెన్నై, కాంచీపురం వరదలు

1996లో ఉత్తర తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఆ సమయంలో పాలార్‌ ఆనకట్ట నుంచి నీరు విడుదల చేయడంతో కాంచీపురం, వలజాబాద్‌, ఉత్తరమేరూర్‌ ప్రాంతాల్లో తీరప్రాంత గ్రామాలను ముంచెత్తాయి. పెద్దగా ప్రాణనష్టం జరగలేదు, కానీ పంటలు, ఇళ్లు నష్టపోయాయి.

2005 – వెల్లూరు, రాణిపేట్‌ ప్రాంతాల్లో నీటిముంపు

ఆ ఏడాది నవంబరులో భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో పాలార్‌ నది ఉప్పొంగి వెల్లూరు జిల్లాలోని ఆర్కొట్‌, గుడియత్తం ప్రాంతాలు నీటిమునిగాయి.

రహదారులపై కొంతకాలం రాకపోకలు నిలిచిపోయాయి.

2015 – చెన్నై వరదల సమయంలో పాలార్‌ కూడా ఉప్పొంగింది

చెన్నైలో 2015లో కురిసిన భారీ వర్షాల వల్ల పాలార్‌ నదికి వరద నీరు పోటెత్తింది. అప్పట్లో వెల్లూరు–రాణిపేట్‌–కాంచీపురం మార్గం వెంట తాత్కాలికంగా నీరు చేరడంతో గ్రామాల్లో రవాణా ఆగిపోయింది.

2021 – థొరై తుఫాను ప్రభావం

డిసెంబర్‌, 2021 లో జవాద్ తుఫాను ప్రభావంతో పాలార్‌ నది మళ్లీ ఉప్పొంగింది. కాంచీపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం అప్పట్లో హెచ్చరికలు జారీ చేసింది. పాలార్‌ ఒక సీజనల్‌ నది. వర్షాలు ఎక్కువగా ఉంటే మాత్రమే వరద వచ్చే అవకాశం ఉంది.

పాలార్ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - Tholi Paluku