
పాలలో కల్తీని ఇలా గుర్తించండి: ఫుడ్ సేఫ్టీ శాఖ సూచనలు
రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న పాల కల్తీ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ఆహార భద్రత శాఖ (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్) అప్రమత్తమైంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పాల ఉత్పత్తుల్లో జరిగే కల్తీని ఇంట్లోనే సులభంగా గుర్తించే పద్ధతులపై విస్త్రృత అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ (ఐపీఎం) నీలకంఠారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తాము వాడే పాలు, నెయ్యి స్వచ్ఛతను పరీక్షించుకోవాలని ఆయన కోరారు.
పాలలో నీటి కల్తీని గుర్తించేందుకు ఒక సులభమైన మార్గాన్ని అధికారులు సూచించారు. ఏదైనా ఒక పళ్లాన్ని లేదా నునుపైన ఉపరితలాన్ని ఏటవాలుగా ఉంచి, దానిపై ఒక చుక్క పాలు వేయాలి. ఒకవేళ అది స్వచ్ఛమైన పాలు అయితే తెల్లటి ధారలా నెమ్మదిగా కిందకు దిగుతూ గీతను ఏర్పరుస్తాయి. అదే నీరు కలిపిన పాలు అయితే తెల్లటి గీత కనిపించకుండా అత్యంత వేగంగా కిందకు జారిపోతాయని అధికారులు వివరించారు. ఈ చిన్న పరీక్ష ద్వారా పాలలో నీటి శాతాన్ని ప్రాథమికంగా అంచనా వేయవచ్చని తెలిపారు.
మరోవైపు పాలలో డిటర్జెంట్ లేదా యూరియా వంటి రసాయనాలు కలిసాయో లేదో తెలుసుకోవడానికి 'షేక్ టెస్ట్' చేయాలని సూచించారు. ఒక గాజు గ్లాసులో 10 మి.లీ పాలు అంతే పరిమాణంలో నీరు కలిపి గట్టిగా కదిలించాలి. ఒకవేళ పాలు కల్తీ అయి ఉంటే పైభాగంలో మందపాటి నురుగు ఏర్పడుతుంది. స్వచ్ఛమైన పాలలో ఇలాంటి నురుగు రాదని స్పష్టం చేశారు. అదేవిధంగా పాలు చిక్కగా కనిపించేందుకు మొక్కజొన్న పిండి లేదా ఇతర స్టార్చ్ పదార్థాలు కలిపినట్లు అనుమానం ఉంటే రెండు మూడు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పాలలో కలపాలి. పాలు నీలం రంగులోకి మారితే అది కల్తీగా గుర్తించాలని వెల్లడించారు.
నెయ్యి విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆహార భద్రత శాఖ హెచ్చరించింది. నెయ్యిలో బంగాళదుంప, చిలకడదుంప గుజ్జు కలిపారో లేదో తెలుసుకోవడానికి ఒక స్పూన్ నెయ్యిలో అయోడిన్ ద్రావణం వేయాలి. రంగు నీలంగా మారితే అది కల్తీ అని అర్థం. అదేవిధంగా నెయ్యిలో వనస్పతి, పామాయిల్ ఉందో లేదో పరీక్షించడానికి ఒక స్పూన్ నెయ్యికి కొద్దిగా చక్కెర కలిపి వేడి చేయాలి. అది ఎరుపు లేదా పింక్ రంగులోకి మారితే వనస్పతి కలిసినట్లు నిర్ధారించుకోవాలి. సహజమైన నెయ్యిని అరచేతిలో వేసి రుద్దితే మంచి సువాసన వస్తుందని కల్తీ నెయ్యికి ఆ గుణం ఉండదని తెలిపారు.
అదేవిధంగా పాల ఉత్పత్తుల నాణ్యతపై ప్రజలకు ఎలాంటి అనుమానం కలిగినా లేదా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. ఇందుకోసం 1800 425 3857 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను లేదా ఐపీఎం ప్రధాన కార్యాలయం 08645 297245 నంబర్‌ను సంప్రదించాలని డైరెక్టర్ నీలకంఠారెడ్డి సూచించారు. కల్తీ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విద్యా సంస్థల్లో కరపత్రాల పంపిణీతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
