Let's talk: editor@tmv.in
పాలమూరు పై కాంగ్రెస్‌ కక్ష.. ఏపీ జలదోపిడీకి అవకాశం!

పాలమూరు పై కాంగ్రెస్‌ కక్ష.. ఏపీ జలదోపిడీకి అవకాశం!

Gaddamidi Naveen
29 డిసెంబర్, 2025

తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టించుకోకుండా నిలిపివేయడం వలన రాష్ట్రానికి నీటి లబ్ధిలో పెద్ద లోటు ఏర్పడిందని బీఆర్ఎస్ ఎక్స్ వేదిక ద్వారా ఆరోపించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండేళ్లుగా పనులు ఆగిపోవడం, పరిశీలనలకు కావాల్సిన రూ.10 కోట్లు కూడా మంజూరు చేయకపోవడం రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిందని బీఆర్ఎస్ పేర్కొంది.

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి అయితే, తెలంగాణకు సాధారణ కోటా నీటితో పాటు మరో 40-50 టీఎంసీలు నీటిని వాడుకునే అవకాశం ఉండేదని. కానీ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడం వలన, కలిగే లబ్ధి పొరుగు రాష్ట్రానికి పోకుండా ఉండేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ఎక్కువ నీటిని వాడుతోందని బీఆర్ఎస్ పేర్కొంది.

కృష్ణా జలాల్లో భారీగా తగ్గిన వినియోగం

శ్రీశైలం నుంచి ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో నీటిని 66:34 నిష్పత్తిలో ఏపీ 690 టీఎంసీలు, తెలంగాణ 332 టీఎంసీలు వాడుకోవాలి. అయితే ఏపీ ఇప్పటికే 630 టీఎంసీలు (82% కోటా) వాడగా, తెలంగాణ కేవలం 120 టీఎంసీలు (18% కోటా) మాత్రమే వాడిందని. మిగిలిన 212 టీఎంసీలను తెలంగాణ వినియోగించకపోవడం, ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా తగ్గింది.

ఏపీ జలదోపిడీ.. శ్రీశైలం నీళ్లన్నీ అటువైపే!

వాస్తవంగా శ్రీశైలం నుంచి తెలంగాణ వాడిన నీటిలో కేవలం 14 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో, పోతిరెడ్డిపాడు ద్వారానే ఏపీ 200 టీఎంసీలను మళ్లించుకుంది. అదనంగా హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 40 టీఎంసీలు ఏపీకి చేరాయి. అంటే, ఒక్క శ్రీశైలం నుంచి ఏపీకి 240 టీఎంసీల కృష్ణా జలాలు పెన్నా బేసిన్‌కి వెళ్లిపోయాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తయ్యుంటే, తెలంగాణకు అవసరమైన నీటిని వేరే రాష్ట్రం తీసుకోకుండా అడ్డుకోవచ్చు అని బీఆర్ఎస్ పేర్కొంది.

కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి, నారాయణపేట, కొడంగల్‌ లిఫ్ట్ ప్రాజెక్టును ప్రాధాన్యంగా తెరపైకి తెచ్చింది. దీనికి కూడా కొత్తగా శ్రీశైలం నుంచి ఏదైనా కేటాయింపు ఇవ్వడం లేదు. భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీలలో 7.33 టీఎంసీలు కోతపెట్టగా, 7.11 టీఎంసీలను నారాయణపేట-కొడంగల్‌కు కేటాయించింది. అంటే కొత్తగా నీటిని తీసుకోకుండా, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల కోటా నుంచి తెలంగాణ‌ పై అదనపు భారాన్ని మోపినట్టే అయింది.

ఈ విధంగా, తెలంగాణ ప్రాజెక్టుల ఆలస్యం, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంపై నీటి వాటా తగ్గుదలకు, ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కువ నీటిని అందించడానికి కారణమయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల, తెలంగాణకు కావాల్సిన నీటిని పూర్తిగా ఉపయోగించుకోవడం అసాధ్యమైంది.

తెలంగాణ ప్రభుత్వానికి, ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి రాష్ట్రానికి నీటి వాటాను సాధించడం అత్యవసరంగా మారింది. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌కి ఏకపక్ష లాభం కలిగించడమే కాకుండా, తెలంగాణకు నీటి భద్రతపై సవాలు సృష్టిస్తున్నాయి..

పాలమూరు పై కాంగ్రెస్‌ కక్ష.. ఏపీ జలదోపిడీకి అవకాశం! - Tholi Paluku