Let's talk: editor@tmv.in
పాలమూరుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్‌ఎస్: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్‌ఎస్: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
18 జనవరి, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం, సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండటమే పాలమూరు ప్రాంత వెనుకబాటుకు ప్రధాన కారణమని అన్నారు. విద్యాభివృద్ధిలో కూడా ఈ ప్రాంతం వెనుకబడిందని వ్యాఖ్యానించారు.

శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగినప్పుడు బీఆర్‌ఎస్ సభ్యులు హాజరుకాలేదని, చర్చ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు అని ఆయన అన్నారు. ముఖ్యంగా 2013లో ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడంపై మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రాకుండా ఫార్మ్‌హౌస్‌లో కూర్చుంటారని, అలాంటి ‘శుక్రాచార్యుడు’ ఒకరు ఉన్నారని ఎద్దేవా చేశారు.

లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సీఎం విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భాషా పరిజ్ఞానం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, నిబద్ధతతో కూడిన క్రమశిక్షణే మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఆయన ఉద్బోధించారు.

జడ్చర్ల ఐఐఐటీకి భూమిపూజ

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ)కు శనివారం సీఎం భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషణలో పాల్గొని సీఎం ప్రస్తావించిన పలు అంశాలపై స్పందించారు. విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించడమే కాకుండా, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

విద్యారంగ అభివృద్ధినే ప్రభుత్వం టాప్ ప్రాధాన్యంగా తీసుకుందని సీఎం అన్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించేందుకు మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని సీఎం వివరించారు.

ప్రపంచంతో పోటీ పడేలా యువతను తీర్చిదిద్దడమే ఈ చర్యల లక్ష్యమని పేర్కొన్న సీఎం, ఎంత ఎదిగినా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరిచిపోవద్దని సూచించారు. రేపటి భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉందని, 25 ఏళ్ల వరకు కష్టపడి చదువుకోవాలని అన్నారు. చదువు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందని, దేశంలోని ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు గుర్తింపు, గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేసిన సీఎం, 75 ఏళ్ల తర్వాత మళ్లీ జిల్లాకు అవకాశం వచ్చిందని తెలిపారు. శనివారం భూమిపూజ చేసిన ఐఐఐటీ భవన నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఐఐఐటీ భూమిపూజ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు మల్లురవి, అరుణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతాం

ఒకప్పుడు తట్టపని, మట్టి పని, పార పనుల కోసం వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుతామని సీఎం పేర్కొన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణకు పర్యటనకు వచ్చే వారు తప్పనిసరిగా పాలమూరు జిల్లాను సందర్శించే స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది తన కల అని ఆయన పేర్కొన్నారు.

‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. ఒకప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చినవారు గ్రాంట్ల కోసం పాలమూరులోని పేదరికాన్ని చూపించాల్సి వచ్చిన పరిస్థితులు బాధాకరమని, పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

పాలమూరు అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన సీఎం, సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతో ట్రిపుల్ ఐటీతో పాటు వందలాది కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని అన్నారు. పాలమూరు జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణాలు సాగునీటి సౌకర్యాల లేమి, విద్యావకాశాల కొరతేనని చెప్పారు. చదువులకు అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు రావాలంటే కేంద్రంలో ప్రధానమంత్రిని కలవాల్సిందేనని, గ్రామంలో అభివృద్ధికి సర్పంచులు ఎంత కీలకమో, దేశవ్యాప్తంగా అభివృద్ధికి ప్రధానమంత్రి అంతే కీలకమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణకు ఐఐఎం సాధించి, దాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోదీని కలిసే ఆలోచన ఉందని తెలిపారు.

విద్య, నీటిపారుదల రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్సెల్‌బీసీ, జూరాల ప్రాజెక్టులతో పాటు ఆర్డీఎస్ పనులు పూర్తిచేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ సమస్యలను ముందుగా పరిష్కరిస్తామని తెలిపారు.

నిరక్షరాస్యత, పేదరికమే తన శత్రువులని, మహిళలకు అన్యాయం చేసే వారు, విద్యార్థులకు నష్టం కలిగించే వారిని సహించబోమని సీఎం స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనే తన ప్రధాన లక్ష్యమని, దాన్ని తెలంగాణ సరిహద్దుల వరకూ తరిమివేయాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా పాలమూరును అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్ధండాపూర్, సంగంబండ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ నిధులు విడుదల చేసినట్టు వివరించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ.1500 కోట్లు మంజూరు చేసి, భూమి కోల్పోయే రైతులకు నూటికి నూరు శాతం నష్టపరిహారం చెల్లించి ప్రజల ఆమోదం తీసుకున్నామని వెల్లడించారు.

పాలమూరుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బీఆర్‌ఎస్: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku