Let's talk: editor@tmv.in
పాలనా వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాం:సీఎం చంద్రబాబు

పాలనా వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాం:సీఎం చంద్రబాబు

Panthagani Anusha
13 జనవరి, 2026

గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రగతిపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి సానుకూల ఫలితాలను అందించిందని ప్రభుత్వంపై ప్రజల్లో పోయిన విశ్వాసాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగామని ధీమా వ్యక్తం చేశారు.

సంక్షేమం అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొంటూ ప్రధాన పథకాల గణాంకాలను సీఎం వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశామని, ‘స్త్రీ శక్తి’ ద్వారా మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, ‘దీపం 2.0’ కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశామని చెప్పారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే సామాజిక పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు వెచ్చించి సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు.

పోలవరం.. ఆంధ్రుల జీవనాడి

అదేవిధంగా రాష్ట్రానికి ప్రాణనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రాబోయే పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. గతంలో రాజధానిని ‘స్మశానం’ అని ఎగతాళి చేసిన వారికి నేటి పురోగతే సమాధానమన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి ఏపీని దక్షిణ భారతంలోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని, కేంద్రంతో చర్చించి రూ.12 వేల కోట్ల ప్యాకేజీతో దాన్ని కాపాడుకున్నామని ఆ పరిశ్రమను నిలబెట్టే పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం గర్వకారణమని పేర్కొన్న చెంద్రబాబు . విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని, అమరావతిలో త్వరలోనే 'క్వాంటం వ్యాలీ'కి పునాది చేస్తామని వెల్లడించారు. వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

కేంద్ర నిధుల వినియోగం పారదర్శకం: ఆర్థిక శాఖ

కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. 2025-26లో సామాజిక సంక్షేమ నిధుల పారదర్శక నిర్వహణ వ్యవస్థ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీ – కేంద్ర పథకాల అమలుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అధికారిక వ్యవస్థవ్యవస్థల ద్వారా ₹12,621 కోట్ల మేర నిధులను పారదర్శకంగా వినియోగించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, విద్యా శాఖ నిధుల వినియోగంలో ముందంజలో ఉండగా మైనారిటీ, సామాజిక సంక్షేమ శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఆదాయ వనరులపై ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ కుమార్ నివేదిక సమర్పించారు. వాణిజ్య పన్నుల శాఖ 86 శాతం వసూళ్లతో లక్ష్యం వైపు సాగుతోందని నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 31 శాతం వార్షిక వృద్ధి నమోదు చేశాయని తెలిపారు. కొత్త ఆదాయ వనరుల అన్వేషణ ద్వారా రూ. 13,100 కోట్ల అదనపు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు వివరించారు. అధికారులు మరింత కష్టపడి ప్రజల ఆశలను నిజం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పాలనా వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాం:సీఎం చంద్రబాబు - Tholi Paluku