Let's talk: editor@tmv.in
పాలనపై సీఎంకు అవగాహనే లేదు: కేటీఆర్

పాలనపై సీఎంకు అవగాహనే లేదు: కేటీఆర్

Gaddamidi Naveen
7 జనవరి, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత ముఖ్యమంత్రికి పాలనపై కనీస అవగాహన లేదు. మూటలు మోసుడు తప్ప ఏం తెలవదన్నట్లుగా పరిస్థితి ఉంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీటి వనరులపై మాట్లాడే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదని, గోదావరి ఎక్కడ ఉందో తెలియని వ్యక్తి కేసీఆర్‌కు నీళ్లపై పాఠాలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పడం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకాలేదని కేటీఆర్ ఆరోపించారు. రైతులు యూరియా కోసం చలిలో గంటల తరబడి క్యూల్లో నిలబడుతున్న పరిస్థితి ఉందని, రైతుల జీవితాలు మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. ఎనకటి రోజులు తెస్తా అన్న రేవంత్ రెడ్డి, వాస్తవానికి రాబందు కాలాన్ని తెచ్చాడు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. గ్రామాల్లో ప్రజలే రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణను 60 ఏళ్ల పాటు దోచుకున్న కాంగ్రెస్ పార్టీ చరిత్రను మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడటం తగదని అన్నారు. నదులు, తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేని వ్యక్తిగా రేవంత్ రెడ్డిని అభివర్ణించారు.

కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నీళ్లు, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు అమలు చేసి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ మోసమేనని, రైతుబంధు 15000 ఇస్తాను, 500 బోనస్, ఉద్యోగాల హామీలతో రైతులు, యువతను రాహుల్ గాంధీ మోసం చేశారని ఆరోపించారు.

మహిళల సంక్షేమంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇవ్వలేని, నెలకు రూ.2500 సహాయం చేయలేని ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం విడ్డూరమని ఆయ‌న విమర్శించారు. మొత్తంగా కాంగ్రెస్ పాలన ప్రజలను నిరాశకు గురి చేసిందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా షాపుల్లో దొరకడం లేదని, యాప్‌లలోనూ లభ్యత లేదని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా 'కార్డు' విధానం తెచ్చి రైతులకు మరింత ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేసే తెలివిలేక కాంగ్రెస్ నేతలు కొత్త నాటకాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేటీఆర్ విమర్శించారు.

పాలనపై సీఎంకు అవగాహనే లేదు: కేటీఆర్ - Tholi Paluku