Let's talk: editor@tmv.in
పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు: డిప్యూటీ సీఎం

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు: డిప్యూటీ సీఎం

Panthagani Anusha
14 ఫిబ్రవరి, 2026

దేవాలయాల నిర్వహణలో పాలక మండళ్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బోర్డులు అప్రమత్తంగా ఉంటేనే ఆలయాల్లో అపచారాలకు తావుండదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పరమ పవిత్ర క్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని నాటి పాలకమండలి బాధ్యతారాహిత్యం వల్లే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు.

రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నియమితులైన నూతన ఆలయ పాలక మండళ్లు గతంలో జరిగిన తప్పులను దృష్టిలో ఉంచుకుని అపచారాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

నాగరికతకు చిహ్నాలు మన ఆలయాలు

మన ఆలయాలు కేవలం కట్టడాలు కావు అవి మన నాగరికత, కళలు, వారసత్వం, సంస్కృతికి ప్రతిబింబాలు అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో గిరిప్రదక్షణ విశిష్టతను గుర్తు చేస్తూ తనకు కూడా ఈ గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరికగా ఉందని వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలోనే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు. మహాశివరాత్రికి రెండు రోజుల ముందే ఈ గిరిప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రూ.10 కోట్లతో గిరిప్రదక్షణ మార్గం

శ్రీకాళహస్తిలో సుమారు 22 కిలోమీటర్ల మేర రూ.10 కోట్ల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్డును నిర్మించామన్నారు. ఈ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ ద్వారా ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షణ చేసిన పుణ్యఫలం దక్కాలని ఆయన ఆకాంక్షించారు.

రూ. 40 కోట్లతో ఆలయాలకు రవాణా వసతి

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్ వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి రోడ్డు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు రూ. 3.70 కోట్లు. కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వైపు వెళ్లే రహదారికి రూ. 4 కోట్లు. అదేవిధంగా వాడపల్లి ఏడువారాల వెంకన్న ఆలయానికి వెళ్లే కరకట్ట రహదారికి రూ. 6 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు.