
పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటతిల్ అరెస్ట్ నిలిపివేత
పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటతిల్‌పై నమోదైన అత్యాచార కేసులో అరెస్టును కేరళ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయంపై ఎమ్మెల్యే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కె. బాబు సమీక్షించారు. కేసు తదుపరి వాదనలు డిసెంబర్ 15న చేపట్టనున్నారు.
ఇంతకు ముందు తిరువనంతపురం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు అతని ఆంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తరువాత రాహుల్ మమ్ కూటతిల్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాదాపు పది రోజులుగా కనిపించకుండా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను వివాహం పేరుతో మోసం చేసి బలవంతంగా లైంగిక దాడి, గర్భస్రావం చేయించారని ఆరోపణలు ఉన్నాయి. మొదట నెడుమంగళ్ వాలియమల పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను, నేరం జరిగిన ప్రాంత ఆధారంగా నేమోం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023లోని ఎనిమిది నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు అయింది. అందులో ప్రధానంగా అత్యాచారం, గర్భస్రావం తదితర ఆరోపణల కింద సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్ల ప్రకారం పది ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు ఉండే అవకాశం ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ మమ్ కూటతిల్‌ను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బహిష్కరించింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
కేరళ సీఎం పినరయ్ విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కోంటున్నవ్యక్తిని కాంగ్రెస్ కాపాడుకుంటోందని, అతడిని ఆలస్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరం చేసినట్టు ఇన్ని ఆధారాలున్న నేతను కాంగ్రెస్ భవిష్యత్ నాయకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేసిందని ప్రశ్నించారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు రావడంతో, కేసులు నమోదు అవ్వడంతో రాహుల్ మమ్ కూటతిల్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు.
