
పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం…చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు బాలురు మృతి
పార్వతీపురం మన్యం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం అధికారికంగా వెల్లడించారు.కాగా మృతి చెందిన వారిద్దరూ లక్కగూడ గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల విద్యార్థులుగా గుర్తించారు.
పాలకొండ డీఎస్పీ జి.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలలు మధ్యాహ్నం వరకే నడుస్తున్నాయి. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన విద్యార్థులు సాయంత్రం 4 గంటల సమయంలో స్నానం కని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగిన క్రమంలో అక్కడ ఉన్న మట్టిలో విద్యార్థులు కూరుకుపోయారు. బయటకు రాలేక, నీటిలో ఊపిరి ఆడక వారు అక్కడికక్కడే మృతి చెందారు.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్తున్నాం అని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన పిల్లలు విగతజీవులుగా తిరిగి రావడంతో ఆ కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ఇక ఈ ఘటనపై పోలీసులు భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
