
పార్లమెంట్ లో మొదటి రోజే ‘సర్’ పై ప్రతిపక్షాల పట్టు
శీతాకాల సమావేశాల మొదటి రోజు లోక్‌సభ పదే పదే వాయిదా పడింది. ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణపై చర్చకు డిమాండ్ చేస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రభుత్వం చర్చకు విముఖత చూపడం లేదని, కానీ సమయం నిర్ణయించలేమని పేర్కొంది. దీంతో గందరగోళంగా ముగిశాయి. సోమవారం లోక్‌సభలో విపక్ష పార్టీలు ఎన్నికల్లో మోసం జరుగుతోందంటూ నినాదాలు చేశాయి. ‘ఓట్ చోర్, గద్ది ఛోడ్’ అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ ఓం బిర్లా పోడియం చుట్టూ ముట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభలోనూ తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పై తక్షణమే చర్చ ప్రారంభించాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌కు ప్రతిస్పందిస్తూ, రిజిజు ఈ విషయంపై స్పందించడానికి మరింత సమయం కోరారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏ అంశంపైనా చర్చ జరపడానికి ఇష్టపడటం లేదు. అయితే సభ ఎలా నడుస్తుంది? మేం అడిగే ఒక్క అంశమైనా వినాలి. ఎస్ఐఆర్ అయినా సరే, లేకపోతే ఎన్నికల సంస్కరణలు లేదా దానికి సంబంధించిన ఏదైనా అంశంపైనా చర్చ జరపొచ్చు. ఏమీ చర్చించకుండా సభ ఎలా నడుస్తుంది? అని ఆమె మీడియాతో అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం కాకుండా, కొందరి ఓట్లను తొలగించేందుకే జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం బలోపేతమయ్యేది మా ఓటు హక్కును ఎవరూ లాగేసుకెళ్లనప్పుడే. ఎస్ఐఆర్ గురించి ఆందోళన ఇప్పుడు నిజమవుతోంది. ఒక వ్యక్తి ఓటు తొలగితే అతని కలలు ఎలా నెరవేరతాయి? నోయిడాలో ఉన్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను (బీజేపీ) నియమించుకుని, వాళ్ల ద్వారా ఉత్తరప్రదేశ్ ఓటరు జాబితా వివరాలు సేకరించారని సమాచారం ఉంది. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం కాదు, ఓట్లు కత్తిరించేందుకే. గ్రౌండ్ లెవెల్‌లో బీఎల్వోలు ఫారాలు కూడా సరిగ్గా నింపలేక ఒత్తిడిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు లేనప్పుడు ఈ తొందర ఎందుకు?” అని అఖిలేష్ ప్రశ్నించారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం (డిసెంబర్ 2) ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ మకర్ ద్వార్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు.
ఓటమి బాధకు యుద్ధ క్షేత్రంగా పార్లమెంట్ ను మార్చొద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం 18వ లోక్‌సభ ఆరవ సెషన్ (శీతాకాల సమావేశాలు) రాజ్యసభ 269వ సమావేశాల ముందు అన్ని రాజకీయ పార్టీలను ఈ పార్లమెంట్ సెషన్‌ను ‘ఓటమి వల్ల కలిగిన నిరాశకు యుద్ధక్షేత్రంగా" లేకుంటే ‘విజయం వల్ల పుట్టిన అహంకారానికి వేదికగా’ మార్చొద్దని కోరారు. దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య బాధ్యతలపైనే పార్లమెంట్ దృష్టి కేంద్రీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
సెషన్ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడిన ప్రధాని మోడీ ఇటీవల ముగిసిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ, భారత ప్రజాస్వామ్యం శక్తి , అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడాన్ని కొనియాడారు.ఈ శీతాకాల సమావేశం కేవలం సంవత్సరానికి ఒకసారి జరిగే ఆచారం మాత్రమే కాదు. దేశ పురోగతిని వేగవంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శీతాకాల సమావేశం కూడా దానికి కొత్త ఊపిరి పోస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య ఉత్సాహం, ఉద్వేగం సమయానుగుణంగా వ్యక్తమై ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కనిపించిన ఓటరు హాజరు ప్రజాస్వామ్యం అతిపెద్ద బలం. తల్లులు, సోదరీమణుల ఎక్కువగా పాల్గొనడం కొత్త ఆశలను, కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రధాని అన్నారు.
కొన్ని పార్టీలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి
బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాలం గడిచేకొద్దీ నాయకులు కాస్త స్థిరంగా ఉంటారని నేను ఆశించాను. కానీ నిన్నటి వారి ప్రకటనలు చూస్తే ఓటమి వారిని తీవ్రంగా కలవరపరచిందని స్పష్టమవుతోంది. అన్ని పార్టీలనూ నేను కోరేది ఒక్కటే – ఈ శీతాకాల సమావేశం ఓటమి నిరాశకు యుద్ధక్షేత్రంగా మారకూడదు, విజయ అహంకారానికి వేదికగా మారకూడదని ఆయన తెలిపారు. భారత ఆర్థిక పురోగతి అద్భుత ఎత్తులకు చేరుకుందని, వికసిత భారత్ లక్ష్యం వైపు పయనించేందుకు విధానాలు, చట్టాలపై పార్లమెంట్ దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం, విపక్షం రెండింటికీ బాధ్యత ఉందని, రాజకీయ పోటీ కంటే నిర్మాణాత్మక చర్చకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలను కోరారు. ఒకవైపు ప్రపంచం మన ప్రజాస్వామ్య బలాన్ని, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఆర్థిక శక్తిని గమనిస్తోంది. భారతదేశం ప్రజాస్వామ్యం ఫలితాలు ఇవ్వగలదని నిరూపించింది అని ప్రధాని పేర్కొన్నారు.శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైన జాతీయ అంశాలు, చట్టసభ వ్యవహారాలు, ఆర్థిక విధానాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో అందరూ కేంద్రీకృత, బాధ్యతాయుతంగా పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పాఠం నేర్చుకోకపోతే విపక్షాలు రాబోయే ఎన్నికల్లో కూడా ‘కొట్టుకుపోతాయని’ అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) ఎంపీలు సోమవారం హెచ్చరించారు. పార్లమెంటులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంపై విపక్షాలు ‘ప్రణాళికాబద్ధంగా’ ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని వారు ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ‘అతిపెద్ద అంశంగా’ చేసుకున్నా ప్రజలు ఎన్డీఏకు భారీ మెజారిటీ ఇచ్చి స్పష్టమైన సందేశం పంపారని జేడీ(యూ) ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా అన్నారు. ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే రాబోయే ఎన్నికల్లోనూ బీహార్ లో ఎదుర్కొన్న ఓటమే ఎదురవుతుందని ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో అన్నారు.
వింటర్ సెషన్ మొదటి రోజైన సోమవారం ఎస్ఐఆర్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేయడంతో లోక్‌సభ కార్యకలాపాలు రోజంతా స్తంభించాయి. రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు. అయినా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కానీ దానికి గడువు నిర్ణయించమని ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. విపక్షాలను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎంపీ, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ మాట్లాడుతూ గత సెషన్ మొత్తం వీళ్ల వల్లే నాశనమైంది. దాని ఫలితంగానే బీహార్ లో ప్రజలు వీళ్లను కొట్టేశారు. ఎస్ఐఆర్ అంశాన్ని ఎంత ఎక్కువగా చర్చిస్తే అంత ఎక్కువగా ప్రజలు వీళ్లను తిరస్కరిస్తారని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ ఎస్ఐఆర్ అంశాన్ని మళ్లీ సభలో లేవనెత్తడం చూస్తే, బిహార్ ఫలితాల నుంచి వీళ్లు ఏమీ నేర్చుకోలేదనిపిస్తోంది.
ఎల్‌జేపీ (రామవిలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ విపక్షాలపై మండిపడ్డారు. వీళ్లకు కేవలం గందరగోళం సృష్టించడమే, డ్రామాలాడటమే మిగిలి ఉంది. పరిష్కారం కోరుకోవడం లేదు. గందరగోళమే వీళ్ల రాజకీయాలను మెరుగులు దిద్దే ఏకైక మార్గంగా మిగిలింది. ఇంతకాలం ఈవీఎంలను నిందించేవాళ్లు, ఇప్పుడు ఎస్ఐఆర్ ను కొత్త సాకుగా కనిపెట్టారు. స్వయంగా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇతరులను నిందిస్తూనే ఉంటే నిరంతరం ఓటములే ఎదురవుతాయని ఆయన విమర్శించారు.
మణిపూర్ జీఎస్టీ రెండో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
లోక్‌సభలో సోమవారం మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (రెండో సవరణ) బిల్లు-2025ను పరిశీలన, ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నినాదాల మధ్య ఆమె మాట్లాడుతూ, 2025 ఫైనాన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 121 నుంచి 134 వరకు సెంట్రల్ జీఎస్టీ యాక్ట్-2017లో సవరణలు చేశాం. ఇవి 2024లోనే పార్లమెంటు ఆమోదించి అమలులోకి తెచ్చింది. అక్టోబర్ 2025 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు తమ జీఎస్టీ చట్టాలను అప్‌డేట్ చేసుకున్నాయి. కానీ మణిపూర్‌లో అసోంబ్లీ సస్పెండ్ అయిన కారణంగా సకాలంలో ఈ సవరణలు జరగలేదని వివరించారు. బీజేపీ దేవరియా ఎంపీ శశాంక్ మణి బిల్లుకు మద్దతిస్తూ మాట్లాడారు. ప్రధాని నాయకత్వంలో గత 8 ఏళ్లలో జీఎస్టీలో ఎన్నో మార్పులు తెచ్చాం. దేశవ్యాప్తంగా ఏకరీతి జీఎస్టీ అమలు చేశాం. దాంతో ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాదే నిర్మలాజీ నాయకత్వంలో జీఎస్టీ 2.0 పేరుతో కొత్త సంస్కరణలు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. బిల్లు ఉద్దేశ్యాల ప్రకారం, మణిపూర్ జీఎస్టీ యాక్ట్-2017ను సెంట్రల్ జీఎస్టీ యాక్ట్-2017కు అనుగుణంగా తీసుకురావడం లక్ష్యం. ఫిబ్రవరి 13, 2025 నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో, పార్లమెంటు సమావేశం లేని సమయంలో అక్టోబర్ 2025లో ఈ సవరణల కోసం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇప్పుడు దానికి బదులుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు 3 గంటల సమయం కేటాయించినా, మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై కేవలం 20 నిమిషాల్లోనే సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025’ను కూడా ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజారోగ్యం కోసం వనరుల సేకరణకు ఈ సెస్ విధించనున్నారు.
