
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత ముగింపు: మార్చి 9 వరకు ఉభయ సభలు వాయిదా
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి విడత శుక్రవారంతో ముగిసింది. లోక్‌సభ, రాజ్యసభలు రెండూ కూడా మూడు వారాల విరామం కోసం వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం, ఉభయ సభలు తిరిగి మార్చి 9వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నాయి. ఈ విరామ సమయంలో వివిధ పార్లమెంటరీ కమిటీలు బడ్జెట్ కేటాయింపులపై లోతైన చర్చలు జరుపుతాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. మొత్తం 65 రోజుల కాలపరిమితితో కూడిన ఈ సెషన్‌లో 30 సిట్టింగ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 2వ తేదీతో ఈ సమావేశాలు పూర్తిగా ముగియనున్నాయి. బడ్జెట్‌పై ప్రాథమిక చర్చలు ముగియడంతో, తదుపరి దశలో నిధుల కేటాయింపులపై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.
స్టాండింగ్ కమిటీల కీలక పాత్ర
ఈ మూడు వారాల విరామం కేవలం సెలవు కాదు. ఇది పార్లమెంటరీ ప్రక్రియలో అత్యంత కీలకమైన సమయం. ఈ కాలంలో వివిధ శాఖలకు సంబంధించిన డిపార్ట్‌మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీలు సమావేశమై, బడ్జెట్‌లో ప్రతిపాదించిన 'గ్రాంట్ల డిమాండ్లను' క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రతి మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల వినియోగంపై ఈ కమిటీలు నివేదికలు సిద్ధం చేస్తాయి.
ఎప్స్టీన్ ఫైల్స్- పెట్రోలియం మంత్రిపై ఆరోపణలు
శుక్రవారం ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లక్ష్యంగా ప్రతిపక్షాలు భారీ నిరసన చేపట్టాయి. అమెరికాకు చెందిన వివాదాస్పద జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లతో మంత్రికి సంబంధాలు ఉన్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించడంతో, ప్రతిపక్ష ఎంపీలు మకార్ ద్వార్ వద్ద ఆయన రాజీనామా కోసం డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల వినూత్న నిరసన
ఈ నిరసనలో భాగంగా విపక్ష ఎంపీలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా "Who's grip, who's choke" (ఎవరి పట్టు, ఎవరి గొంతుక) అనే నినాదంతో ఉన్న ప్లకార్డులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన తాజా నివేదికల ఆధారంగా మంత్రిపై తక్షణమే విచారణ జరపాలని వారు పట్టుబట్టారు.
జనరల్ నరవాణే పుస్తకంపై వివాదం
మరోవైపు, మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే రాసిన 'అన్ పబ్లిష్డ్' (ఇంకా ప్రచురించబడని) జ్ఞాపకాల పుస్తకం గురించి పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ పుస్తకంలోని కొన్ని వివాదాస్పద అంశాలను రాహుల్ గాంధీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడంపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సైనిక రహస్యాలు లేదా అంతర్గత విషయాలను బహిర్గతం చేయడంపై సభలో వాగ్వాదం చోటుచేసుకుంది.
రాహుల్ గాంధీపై మోషన్ ఉపసంహరణ
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ వివాదంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీపై ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అదే అంశంపై 'సబ్‌స్టాంటివ్ మోషన్' ప్రవేశపెట్టారని, కాబట్టి ప్రభుత్వం తన సొంత తీర్మానాన్ని పక్కన పెట్టిందని ఆయన వివరించారు.
రాహుల్ గాంధీపై నిశికాంత్ దూబే ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిశీలిస్తున్నారని రిజిజు తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి పంపాలా, లేక నేరుగా సభలోనే చర్చించాలా అనే విషయంపై స్పీకర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 9న సభ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ అంశం మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే మోషన్ను ఎద్దేవా చేసిన ప్రమోద్ తివారీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రవేశపెట్టిన 'సబ్‌స్టాంటివ్ మోషన్'పై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంటరీ నిబంధనలు తెలిసిన వారు ఈ చర్యను చూసి నవ్వుతారని, ఇది కేవలం సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నమని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని 'ఐరన్ మ్యాన్'గా అభివర్ణించిన తివారీ, ఆయన ప్రజల, రైతుల గొంతుక అని, గతంలో ఒకసారి సభ్యత్వం తొలగించినా ఆయన భయపడలేదని, బీజేపీ ఎన్ని జన్మలెత్తినా రాహుల్ గాంధీని అపలేదని స్పష్టం చేశారు.
మరోవైపు, రాహుల్ గాంధీ విదేశీ శక్తుల సహాయంతో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె ప్రచురించని పుస్తకంలోని అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడం అనైతికమని పేర్కొంటూ, ఆయనపై జీవితకాల ఎన్నికల నిషేధం విధించాలని దూబే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ప్రైవేట్ సభ్యుడైన దూబే ఇప్పటికే మోషన్ ప్రవేశపెట్టినందున, ప్రభుత్వం తరపున తీసుకురావాలనుకున్న తీర్మానాన్ని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
