
పార్లమెంట్ గుండాగర్దీకి వేదిక కాదు: కిరెన్ రిజిజు
లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ చాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీలు అలజడి సృష్టించారని, ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్‌ను స్తంభింపజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి భద్రతపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన హెచ్చరికపై స్పందించిన రిజిజు, కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన పూర్తిగా అనుచితమని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి సీటు వైపు వెళ్లి ఎటువంటి అనూహ్య ఘటనకు పాల్పడవచ్చనే సమాచారం నేపథ్యంలో, ప్రధానమంత్రి సభకు హాజరుకావద్దని స్పీకర్ సూచించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ స్పీకర్ చాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనను ఖండించడానికి మాటలు సరిపోవు. కాంగ్రెస్ పార్టీ నాయకుడికే తనపై నియంత్రణ లేకపోతే, స్పీకర్ చేసిన హెచ్చరిక సరికాదని ఎలా చెప్పగలం?అని అన్నారు. ప్రధానమంత్రి సభలోకి వచ్చినప్పుడు గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ ముందస్తు ప్రణాళిక రూపొందించిందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి చేతిలో ఉన్న పత్రాలను లాక్కోవాలని కూడా కాంగ్రెస్ ప్రణాళిక వేసింది. పార్లమెంట్ గుండాగర్దీకి(దౌర్జన్యం) వేదిక కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ వ్యవహారంలో మేము సహనం పాటించాం. కానీ ప్రతిదానికి ఒక హద్దు ఉంటుందని రిజిజు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం సభను సజావుగా నడపాలనుకుంటోందని, కానీ నిరంతర అంతరాయాల వల్ల పార్లమెంటరీ వ్యవహారాలు నిలిచిపోతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ నడవనివ్వకపోతే, దాని నష్టాన్ని ఇతర ఎంపీలే భరించాల్సి వస్తుందని చెప్పారు. అధ్యక్ష ప్రసంగానికి కృతజ్ఞతల తీర్మానంపై చర్చ కూడా కాంగ్రెస్ వల్ల జరగలేదని తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుంటోంది. కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన వల్ల స్పీకర్ కూడా మనస్తాపానికి గురయ్యారని పేర్కొన్నారు. సభ ఇలాగే నిలిచిపోయినట్లయితే ప్రతిపక్షానికే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బడ్జెట్‌పై చర్చకు అవకాశం లేకుండా వాయిస్ ఓటుతో ఆమోదమైతే, మాట్లాడే అవకాశం ప్రతిపక్ష ఎంపీలకు దక్కదు. ఇందుకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
లోక్‌సభ స్తంభించడానికి రాహుల్ గాంధీ మొండితనమే కారణమని ఆరోపించారు. సభలో నిబంధనల ప్రకారమే మాట్లాడాలి. నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడితే దానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ నిబంధనలు ఆయన తాతల కాలంలోనే రూపొందించారని ఆయన అన్నారు. ఇండియా–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై చర్చ కోరుతూ ప్రతిపక్షం నినాదాలు చేయడంతో సోమవారం లోక్‌సభలో ఎలాంటి శాసన కార్యకలాపాలు జరగలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఇదే సమయంలో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ప్రతిపక్షం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రశ్నోత్తరాల ప్రారంభానికి ముందు స్పీకర్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో చారిత్రక విజయం సాధించిన భారత జట్టును అభినందించారు.
మరోవైపు, కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చలో పాల్గొనాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన ఫ్లోర్ లీడర్ల సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. బడ్జెట్‌కు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంట్ రెండు సభల్లో ప్రతిపక్షం లేవనెత్తనుందని వర్గాలు తెలిపాయి.
రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పూర్తిగా విచిత్రం: శశి థరూర్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పష్టం చేశారు. సభలో ఒక వైపునకు మాత్రమే మాట్లాడే హక్కును నిరాకరించడం పూర్తిగా విచిత్రమైన విషయమంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిన బాధ్యత తనకే అప్పగించారని, అయితే తన ప్రసంగానికి ముందుగా రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలని తాను కోరిన సమయంలో తన మైక్‌తో పాటు ప్రతిపక్ష నేత మైక్‌ను కూడా నిలిపివేశారని తెలిపారు. లోక్‌సభ రోజంతా వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన థరూర్ ఈ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. బడ్జెట్‌పై చర్చ జరగకూడదనేది స్పీకర్ ఉద్దేశమా, లేక ప్రభుత్వ ఉద్దేశమా అనేది అర్థం కావడం లేదని అన్నారు. 70 ఏళ్లకు పైగా కొనసాగుతున్న పార్లమెంటరీ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ సభలో ఇద్దరు మాట్లాడేందుకు లేచినప్పుడు ముందుగా ప్రతిపక్ష నేతకే అవకాశం ఇవ్వాలి, తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి. ఇదే సంప్రదాయం. కానీ ఇప్పుడు వరుసగా ఇద్దరు అధ్యక్షులు ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వలేదని విమర్శించారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చేతి పైకెత్తగానే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని, అదే సమయంలో ప్రతిపక్ష నేతకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇలా ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం సరికాదు. సభ ప్రభుత్వానిదే కాదు.మన అందరిదీ అని అన్నారు. ప్రభుత్వానికి సమాధానం చెప్పే హక్కు తప్పకుండా ఉంటుందని, దాన్ని ఎవరూ అడ్డుకోరని పేర్కొన్న థరూర్, కానీ ముందుగా రాహుల్ గాంధీ తన ఆందోళనలను సభ ముందు ఉంచనివ్వాలి. ఆయనను మాట్లాడనివ్వకపోతే, చర్చ, చింతన కోసం ఉన్న పార్లమెంట్ లక్ష్యాన్నే దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంపై వచ్చిన కొన్ని ఆరోపణలను స్పష్టం చేయడానికి మాత్రమే లేచారని, మహిళా ఎంపీలు ప్రధానమంత్రిపై దాడి చేయబోతున్నారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలనుకున్నారు. ఆయన ఏమి చెప్పేవారో మనకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. బడ్జెట్ చర్చ ప్రారంభానికి ముందు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ డిమాండ్‌పై ప్రభుత్వం–ప్రతిపక్షం మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో, లోక్‌సభను రోజంతా వాయిదా వేశారు.
మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనప్పుడు, అధ్యక్ష స్థానంలో ఉన్న సంధ్యా రాయ్, బడ్జెట్ చర్చను ప్రారంభించాల్సిందిగా థరూర్‌ను కోరారు. అయితే ఆయన, ప్రతిపక్ష నేతకు ముందుగా అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై సంధ్యా రాయ్, బడ్జెట్‌పై మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీకి అనుమతి ఉందని చెప్పగా, రాహుల్ గాంధీ — స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో తనకు ముందుగా మాట్లాడే హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అలాంటి ఒప్పందం తనకు తెలియదని, నోటీసు లేకుండా ఎలాంటి అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతి ఇవ్వలేమని సంధ్యా రాయ్ స్పష్టం చేశారు. ఈ సమయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు జోక్యం చేసుకుని, అలాంటి ఒప్పందమే లేదని, స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయాలంటే స్పీకర్ కూడా సభలో ఉండాలని అన్నారు. రెండు పక్షాలు తమ వైఖరిని మార్చకపోవడంతో, లోక్‌సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది.
