
పార్లమెంట్‌లో వాడీవేడిగా వాగ్భాణాలు
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో వివిధ రాజకీయ అంశాలపై అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం, శివసేన రాజకీయాలు, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియపై ప్రతిపక్ష చర్యలు చర్చకు దారి తీశాయి. అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ పై ప్రధాని రాజీపడ్డారు అనే ఆరోపణను పునరుద్ఘాటించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ మధ్యలో లేచి మాట్లాడారు. లోక్‌సభలో తాను ప్రధాని గురించి, మాజీ సైన్యాధిపతి పుస్తకం గురించి ప్రస్తావించినప్పుడు పలుమార్లు తనను మాట్లాడనీయలేదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గతంలో ప్రధాని రాజీపడ్డారని, అలాగే మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం విషయాన్ని ప్రస్తావించానని, ఎఫ్‌స్టీన్ అంశం కూడా లేవనెత్తానని చెప్పారు. కానీ ప్రతి సారి తనను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.
ప్రధాని రాజీపడే వ్యక్తి కాదు
అయితే ఈ ఆరోపణలను రవి శంకర్ ప్రసాద్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ రాజీపడే వ్యక్తి కాదని, అలాగే ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్‌లో చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయం మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన కానీ ఇంకా ప్రచురించని మోమోయర్ నుంచి తీసుకున్న భాగాల గురించి. ఆ పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదని, దాని నిజసత్యాలను ఎలా నిర్ధారించగలమని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
మూజువాణి ఓటుతో వీగిపోయిన తీర్మానం
ఇదే చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభకు తటస్థ సంరక్షకుడిగా ఉంటారని, ఆయన నిర్ణయాలను అనుమానించడం పార్లమెంటరీ వ్యవస్థకు తగదని అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌పై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరడం సరైంది కాదని అమిత్ షా పేర్కొన్నారు. పార్లమెంట్ మార్కెట్ కాదని, ఇక్కడ చర్చించాల్సిన అంశాలు నియమాల ప్రకారం నిర్ణయించబడతాయని అన్నారు. గాంధీ కుటుంబంలో గతంలో ఉన్న నాయకుల కాలంలో కూడా ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌పై లోక్‌సభలో చర్చ జరగలేదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు విషయాన్ని కూడా అమిత్ షా ప్రస్తావించారు. 17వ లోక్‌సభలో ఆయన హాజరు 51 శాతం మాత్రమే ఉండగా జాతీయ సగటు 66 శాతం ఉందని తెలిపారు. అలాగే 16వ లోక్‌సభలో ఆయన హాజరు 52 శాతం, 15వ లోక్‌సభలో 43 శాతం మాత్రమేనని వివరించారు. ఇదిలా ఉండగా స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షం తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. సభలో నినాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
డిప్యూటీ స్పీకర్ లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శ
కాంగ్రెస్ నేత కేసీ.వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గత ఏడేళ్లుగా లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించలేదని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ కాకుండా చైర్‌పర్సన్‌ల ప్యానెల్ సభ్యుడు అధ్యక్షత వహించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. స్పీకర్ స్వయంగా నియమించిన ప్యానెల్ సభ్యులు ఈ చర్చకు అధ్యక్షత వహించడం తగదని పేర్కొంటూ, ఈ తీర్మానానికి ప్రత్యేకంగా సభ ఒక సభ్యుడిని ఎన్నుకోవాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అయితే సభను నడిపిస్తున్న బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ ఈ అభ్యంతరాలను తిరస్కరించారు. సభ నియమాల ప్రకారం చైర్‌పర్సన్‌ల ప్యానెల్ సభ్యుడు కూడా సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చని చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ విమర్శలు
బీజేపీ ఎంపీ నిశికాంత్‌దూబే శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ థాకరే పై విమర్శలు చేశారు. అధికారంలో ఉండేందుకు తన పార్టీ సిద్ధాంతాలను త్యాగం చేశారని ఆరోపించారు. 1969లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో బాల ఠాక్రే పై దాడి కుట్ర జరిగిందని, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన లైసెన్స్ రివాల్వర్‌తో గాల్లో కాల్పులు జరిపారని చెప్పారు. ఆ ఘటన తర్వాత కాంగ్రెస్‌తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని బాల ఠాక్రే ప్రమాణం చేశారని దూబే గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం శివసేన (యూబీటీ) కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. 2022లో పార్టీ చీలికకు కూడా ఇదే కారణమని పేర్కొన్నారు. ఆ సమయంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం బీజేపీ మద్దతుతో షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సీఈసీ తొలగింపుకు ప్రతిపక్ష సంతకాల సేకరణ
ఇక ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సంతకాల సేకరణ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నోటీసును భారత ఎన్నికల సంఘం అధిపతిపై త్వరలో పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. లోక్‌సభలో సమర్పించనున్న నోటీసుకు సుమారు 120 మంది ఎంపీలు, రాజ్యసభలో దాదాపు 60 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. నియమాల ప్రకారం సీఈసీ తొలగింపు నోటీసుకు లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యుల మద్దతు అవసరం. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగిస్తున్నారని విమర్శించారు.
సీఈసీ తొలగింపు ప్రక్రియ
చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంతో సమానంగా ఉంటుంది. ఆయన అసమర్థత ఆధారంగా, లేకుంటే అధికారానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రమే ఇంపీచ్‌మెంట్‌కు అవకాశం ఉంటుంది.పార్లమెంట్‌లో ఏ సభలోనైనా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే అది మొత్తం సభ్యుల మెజారిటీతో పాటు హాజరైన సభ్యుల్లో రెండు మూడవ వంతు మెజారిటీతో ఆమోదం పొందాలి. జడ్జెస్(ఇంక్వైరీ ) యాక్ట్, 1968 ప్రకారం రెండు సభల్లోనూ నోటీసు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్, చైర్మన్ సంయుక్తంగా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
