Let's talk: editor@tmv.in
పార్లమెంట్‌లో దేశ సమస్యలపై చర్చ జరగాలి: విపక్షాలు

పార్లమెంట్‌లో దేశ సమస్యలపై చర్చ జరగాలి: విపక్షాలు

Pinjari Chand
28 జనవరి, 2026

బడ్జెట్ సమావేశాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్), ఎంజీఎన్‌రేగా రద్దు, భారత విదేశాంగ విధానం, ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై చర్చ జరగాలని విపక్ష పార్టీలు మంగళవారం డిమాండ్ చేశాయి. పార్లమెంట్ సజావుగా నడవాలంటే విపక్షాల స్వరం వినిపించాల్సిందేనని అవి స్పష్టం చేశాయి. బడ్జెట్ సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, ప్రభుత్వం సెషన్‌కు సంబంధించిన తాత్కాలిక శాసన అజెండాను పంచుకోలేదని విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిని తేలికగా కొట్టిపారేశారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా (లిస్ట్ ఆఫ్ బిజినెస్)ను అందజేస్తామని, సభ్యులకు అది ఇస్తామని హామీ ఇచ్చారు.

రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారి మాట్లాడుతూ, రూపాయి విలువ క్షీణత, ఎంజీఎన్‌రేగాను రద్దు చేసి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) [వీబీ-జీ రాం జీ ] చట్టంతో భర్తీ చేయడం వంటి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతుందని తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.92కి పడిపోయింది. రష్యా చమురు కొనుగోళ్లు, అమెరికా ఆంక్షలు, ఢిల్లీలో కాలుష్యం, ఇండోర్‌లో మరణాలు, గాంధీనగర్‌లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి వంటి అంశాలపై చర్చ జరగాలని తివారి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశం కూడా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. అత్యంత తీవ్రమైన సమస్య నిరుద్యోగం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి భరోసా ఇచ్చే ఎంజీఎన్‌రేగాను రద్దు చేయడం వల్ల కోట్లాది ప్రజలు ప్రభావితమయ్యారని ఆయన అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఉపనేత సాగరిక ఘోష్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో తాము స్పష్టం చేసినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ నిర్వహణ విధానం ఎన్నికల కమిషన్ తటస్థత, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది తప్పనిసరిగా పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఘోష్ అన్నారు. ఎన్‌డీఏ పాలనలో లేని రాష్ట్రాలకు రావాల్సిన నిధులు నిలిపివేయడాన్ని కూడా తాము ప్రస్తావించామని తెలిపారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఈడీ కేసులపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఒకవైపు మాత్రమే నడిచే వీధి కాదు. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. బిల్లులను రెండు మూడు నిమిషాల్లో ఆమోదించకూడదు. కమిటీలకు పంపి, లోతైన అధ్యయనానికి సమయం ఇవ్వాలని ఆమె అన్నారు.

అమెరికా నుంచి పదేపదే అవమానాలు

సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, భారత విదేశాంగ విధానం, కార్మిక చట్టాలు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, ఎంజీఎన్‌రేగా స్థానంలో వీబీ–జీ రాం జీ అమలు వంటి అంశాలపై సక్రమమైన చర్చ కోరామని తెలిపారు. విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్‌, అమెరికా పరిపాలన నుంచి భారత్ పదేపదే అవమానానికి గురవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. పాలస్తీనా, ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలో గవర్నర్ పదవిని విపక్ష పాలిత రాష్ట్రాల్లో పరిపాలన అడ్డుకునేందుకు వినియోగిస్తున్నారని విమర్శించారు. ఎంజీఎన్‌రేగా రద్దుతో సుమారు 50 కోట్ల మంది ప్రభావితమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ భారం పడిందని చెప్పారు.

ఎస్ఐఆర్ పై కూడా చర్చ కావాలని బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ఓటర్ల హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక ఎంపీ అయిన నాకే ఈ క్లిష్టమైన ధృవీకరణ ప్రక్రియ ఎదురైతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల అజెండాను ఇవ్వకపోవడాన్ని పలువురు విపక్ష నేతలు అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించారని కాంగ్రెస్ నేత కె. సురేష్ తెలిపారు. ప్రభుత్వం వ్యాపార జాబితా ఇవ్వలేదు. ఖాళీ కవర్ ఇచ్చారు. ఇప్పుడు అయిష్టంగానే అజెండాను పంచుకునేందుకు అంగీకరించారని బ్రిట్టాస్ విమర్శించారు.

సీపీఐ నేత పీ. సంతోష్ కుమార్ కేరళకు రూ.21,000 కోట్లకు పైగా వనరుల లోటు ఉందని, దాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివమల్’గా మారుతోందని హెచ్చరించారు. ఎంజీఎన్‌రేగా పునరుద్ధరణ, ఆశా కార్యకర్తల వేతనాల పెంపు, కార్మిక చట్టాల ఉపసంహరణ, సీడ్ బిల్‌కు వ్యతిరేకంగా చర్చ జరగాలని కోరారు.

అయితే మంత్రి కిరణ్ రిజిజు, వీబీ–జీ రాం జీ చట్టం, ఎస్ఐఆర్ అంశాలపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ ఉండదని స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలపై ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగిందని, ఇక వెనక్కి వెళ్లలేము అని అన్నారు. విపక్షాలు లేవనెత్తిన అంశాలు రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రస్తావించవచ్చని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై, తొలి దశ ఫిబ్రవరి 13తో ముగియనున్నాయి.