
పార్లమెంట్‌లో చర్చ జరగాలి ‘సర్’
నేటి నుంచి (డిసెంబర్ 1) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతకాల సమావేశాలకు ముందు ఆదివారం నిర్వహించిన అన్ని పార్టీలతో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్‌పై, జాతీయ భద్రతపై తప్పనిసరిగా చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సవ్యంగా నడవాలంటే అందరూ సహకరించాలని కోరింది. మొత్తం 36 రాజకీయ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగన్ తదితరులు ప్రభుత్వ తరఫున పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ అంశమే ప్రధాన అంశంగా నిలిచింది. ఢిల్లీ పేలుడు, జాతీయ భద్రత, కార్మిక కోడ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల ఆలస్యం, గవర్నర్లు బిల్లులను నిలిపివేయడం వంటి అంశాలు కూడా అనేక పార్టీలు ప్రస్తావించాయి.
చల్లగా ఆలోచించండి: కిరణ్ రిజిజు
సమావేశం అనంతరం కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఇది శీతకాల సమావేశాలు కాబట్టి అందరూ చల్లగా ఆలోచిస్తూ పనిచేయాలని సూచించారు. పార్లమెంట్‌ను అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని, హౌస్ సజావుగా నడవడానికి ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చిస్తుందని తెలిపారు. ఎస్ఐఆర్ పై చర్చను అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు ఆజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ సాయంత్రం నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలకు తాము ఎటువంటి హామీ ఇవ్వకపోయినా, సభ సజావుగా సాగేలా చూడాలని రిజిజు అన్నారు.
పది బిల్లులు పరిశీలనకు కూడా రాలేదు: జైరాం రమేష్
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అఖిలపక్ష సమావేశాన్ని ‘ కేవలం లాంఛనప్రాయం’ అని అభివర్ణించారు. ప్రతిపక్షాలతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఒక అంశం పై చర్చకు స్వల్పకాలిక వ్యవధికి జాబితా చేయడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ఉద్దేశాలను స్పష్టం చేసిందని అన్నారు. 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు పార్లమెంటరీ చరిత్రలోనే అతి తక్కువ సమయం జరుగుతాయి. మోడీ ప్రభుత్వం 13 బిల్లులను ఆమోదం కోసం జాబితాలో పొందుపరిచింది. వీటిలో ఒకటి ఆర్డినెన్స్ స్థానంలో వస్తుంది. రెండు లోక్‌సభ కమిటీ ద్వారా వెళ్లాయి. కానీ 10 బిల్లులను సంబంధిత స్టాండింగ్ కమిటీ పరిశీలించనేలేదు అని ఆయన ఆరోపించారు.
పార్లమెంటరీ సంప్రదాయాలను అంతం చేయాలని చూస్తున్నారు:గోగోయ్
లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ జాతీయ భద్రత, వాయు కాలుష్యం, ఓటర్ల జాబితా స్వచ్ఛత, విదేశాంగ విధానం, పంటలకు సరైన ధర లభించని రైతుల సమస్యలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి, హోంమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాలను అంతం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది అని ఆయన అన్నారు. ఇతర దేశాల చర్యల ఆధారంగా భారతదేశ విదేశాంగ విధానాన్ని రూపొందిస్తున్నారని గొగోయ్ అన్నారు.
40 మంది మరణించారు:టీఎంసీ
సమాజవాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ పై చర్చ లేకుంటే పార్లమెంట్‌ను నడవ నివ్వమని హెచ్చరించారు. పలు బూత్ స్థాయి అధికారులను నిర్దేశిత ఓట్లు తొలగించమన్న ఒత్తిడితో ఆత్మహత్యలకు దారి తీసిన అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యసభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై చర్చ జరగకపోతే, పార్లమెంటు పనిచేయకూడదని ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. మోడీ సభకు వచ్చినప్పటికీ పార్లమెంటరీ చర్చలలో పాల్గొనే బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. టీఎంసీ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కారణంగా 40 మంది మరణించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం లక్ష్యం ఓట్ల తొలగింపేనని ఆయన విమర్శించారు. ఢిల్లీ పేలుడు విషయంలో జాతీయ భద్రతలో పెద్ద లోపం బయటపడిందని అన్నారు. డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ మాట్లాడుతూ ప్రతిపక్షం మొత్తం ఎస్ఐఆర అంశం చర్చలోకి రావాలని ఏకగ్రీవంగా కోరుతోందని తెలియజేశారు. సీపీఐ సీపీఐ(ఎం) నాయకులు కూడా ఇదే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అన్ని పార్టీలు ఎస్ఐఆర్ పై చర్చను డిమాండ్ చేశాయని, కానీ తమ పార్టీ ఎన్నికల సంస్కరణలపై చర్చను కోరుకుంటోందని బీజేడీకి చెందిన సస్మిత్ పాత్రా అన్నారు.
ప్రభుత్వం 13 బిల్లులను లిస్టు చేసిన ఈ శీతకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై డిసెంబర్ 19న ముగుస్తాయి. సెషన్ ప్రారంభం నుంచే ఎస్ఐఆర్ అంశం పార్లమెంట్‌ను అడ్డుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో సర్కార్-ప్రతిపక్షాల వాదనలు మరింత తీవ్రతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమావేశాల తొలి రోజున ప్రధాని మీడియా బ్రీఫింగ్
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యే డిసెంబర్ 1న (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు వివరణ ఇవ్వనున్నారు. ఈ బ్రీఫింగ్ పార్లమెంట్ హౌస్‌లోని హంసద్వార్‌లో ఉండనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక శాసన, ఆర్థిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనుంది.
పార్లమెంట్ ముందుకు ప్రధాన బిల్లులు
సమాచారం ప్రకారం క్రింది ప్రధాన బిల్లులు ఈ సెషన్‌లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశముంది అందులో
• హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025
• మణిపూర్ జీఎస్టీ (రెండో సవరణ) బిల్లు, 2025
• సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025
ఈ మూడు బిల్లులూ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల ప్రకారం రాష్ట్రపతి సిఫార్సుతో ప్రవేశపెడుతున్నారు.
అదనంగా ఈ శాసన ప్రణాళికలో ఇవి కూడా ఉండనున్నాయి
• జన్ విశ్వాస్ (అమెండ్‌మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్) బిల్, 2025
• దివాళా అండ్ దివాళా చట్టం (సవరణ) బిల్లు, 2025
• రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు, 2025
• నేషనల్ హైవేస్ (సవరణ) బిల్లు, 2025
• అటామిక్ ఎనర్జీ బిల్లు, 2025
• కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు, 2025
• సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (ఎస్ఎంసీ), 2025
• ఇన్సూరెన్స్ లాస్ (సవరణ) బిల్లు, 2025
• ఆర్బిట్రేషన్ & కన్సిలియేషన్ (సవరణ) బిల్లు, 2025
• హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు, 2025
2025-26 ఆర్థిక సంవత్సరానికి మొదటి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ, ఓటింగ్ సంబంధిత అప్రోప్రియేషన్ బిల్లులను కూడా పార్లమెంట్‌లో చర్చించి ఆమోదించనుంది.
ఇండియా మిత్రపక్షాల సిద్ధత
విపక్ష ఇండియా బ్లాక్ పార్లమెంట్‌లో తమ వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు, సోమవారం రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆఫీసులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
