
పార్టీ లైన్ ఎప్పుడూ తప్పలేదు: శశిథరూర్
తన తాజా వ్యాఖ్యలు, వ్యాసాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడిందన్న ఆరోపణలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ శశి థరూర్ ఖండించారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ తప్పలేదని స్పష్టం చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) నిర్వహించిన ‘లక్ష్య 2026’ నాయకత్వ శిబిరానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకే ఈ శిబిరం సుల్తాన్ బతేరీలో నిర్వహించారు.
నేను పార్టీ లైన్ నుంచి తప్పిపోయానని ఎవరు చెప్పారు? వివిధ అంశాలపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో, చాలా విషయాల్లో పార్టీ అభిప్రాయాలకు నేను సమాంతరంగానే ఉన్నానని థరూర్ అన్నారు. పార్లమెంట్‌లో మంత్రులను ప్రశ్నించే సందర్భంలో తన ప్రశ్నలకు స్పష్టమైన దిశ ఉందని, వాటితో పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూర్తి సందర్భాన్ని చదవకుండా కేవలం హెడ్‌లైన్ల ఆధారంగా కథనాలు రాయడమే వివాదాలకు కారణమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నేను నిజంగా ఏమి రాశానో చాలామంది చదవలేదు. పూర్తి వ్యాసం చదివిన తర్వాతే అసలు అంశం అర్థమవుతుందని తెలిపారు. గత 17 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను సహచరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని, ఇప్పుడు అకస్మాత్తుగా అపార్థాలకు తావివ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
పెద్దలను గౌరవించడం మన సంస్కృతి
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన తర్వాతే ఈ వివాదాలు మొదలయ్యాయా? అన్న ప్రశ్నకు, పార్టీకి ప్రజాస్వామ్య సంప్రదాయాలున్నాయని, గతంలోనూ అనేక అంతర్గత ఎన్నికలు జరిగాయని చెప్పారు. నేను పోటీ చేశాను, ఓడిపోయాను. అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది. ఇందులో ప్రత్యేక కథేమీ లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన 98వ పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా మాట్లాడానని చెప్పారు. మన సంస్కృతి పెద్దల్ని గౌరవించడం నేర్పుతుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ తాను ఒక ప్రజా కార్యక్రమంలో చెప్పిన మాటల్ని మాత్రమే ఉటంకించానని, ఎక్కడ ప్రశంసించానో చూపించాలని సవాల్ చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతూ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతామని, రాష్ట్ర నాయకత్వంతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. కొందరు కాంగ్రెస్ ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే తుది నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని అన్నారు.
ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లే ప్రజల కోసం తాను మాట్లాడుతున్నానని థరూర్ తెలిపారు. పెట్టుబడులకు కేరళ తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని, ఉపాధి అవకాశాలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, అప్పుల వడ్డీలకే బడ్జెట్‌లో పెద్ద భాగం ఖర్చవుతోందని పేర్కొన్నారు. అన్ని రంగాలపై సమగ్ర అధ్యయనం అవసరమని సూచించారు.
యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేసిన థరూర్, కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందన్న అంచనాలు సాధ్యమేనని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్‌లో ప్రతిభకు కొరత లేదని, ఎమ్మెల్యేలతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేరళ రాజకీయాల్లో తన పాత్రను వివరిస్తూ పార్లమెంట్ బాధ్యతలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తానని చెప్పారు. 2021లో కోవిడ్ సమయంలోనూ నేను 56 నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. ఈసారి మరింత చురుగ్గా ఉంటాను అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా థరూర్ వ్యాఖ్యలు, వ్యాసాలు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.
