
పార్టీ బలోపేతానికి సేనాని వ్యూహం
ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి ఇంకోలెక్క.. టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని అదే మహా ప్రసాదం అనుకుని పోటీ చేసే పరిస్థితి లేదు. మనం ఇంకాస్త ఎదగాలి. ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈసారి కనీసం యాభై స్థానాల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఈమేరకు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. రాజకీయాల్లో రాటుదేలాలని అయన భావిస్తున్నారు.
గెలిపించే బాధ్యత తీసుకోవాలి
ఇప్పుడున్న 21 సీట్లకు మించి ఎదగాలన్నది సేనాని వ్యూహంగా కనిపిస్తోంది. దేనికోసం ఆయన పార్టీని విస్తరించేందుకు ప్లాన్ వేస్తున్నారు. దీనికోసం ఒక కార్యాచరణ రచించారు. ప్రస్తుతం పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారు ఒకొక్కరు ఐదేసి నియోజకవర్గాలను దత్తత తీసుకుని అక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పవన్ తలపోస్తున్నారు. వీరు ఆ ఐదు సెగ్మెంట్లలో జనసేన పార్టీ పటిష్టతకు కృషి చేయాలి. పార్టీకి ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా ఇదే విధంగా కృషి చేయాలన్నారు. దీంతో ఫైనల్ గా పార్టీకి వంద స్థానాల్లో బలం ఏర్పడుతుందన్నది పవన్ ఆలోచనగా ఉన్నది. ఎమ్మెల్యేలు జనవాణి పేరుతో ప్రజలలో మమేకం కావాలని ఆదేశించారు.
పార్టీని బలోపేతం చేయాలి
నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని తద్వారా పార్టీని బలోపేతం చేయాలనీ ఆదేశించారు. దీంతో బాటు వివిధ వర్గాల ప్రజానీకంతో కలసి పనిచేయాలని, పార్టీ విధానాలను వారికి వివరించడం ద్వారా మరింత దగ్గర కావాలని సూచించారు. ప్రతీ అయిదేళ్ళకూ కొత్త ఓటర్లు వస్తారు, వారి అభిరుచులు అభిప్రాయాలను అన్నీ తెలుసుకోవాలని పవన్ కోరారు నవతరంతో కలసిపోతే వారి ఆలోచనలు వారి ఆకాంక్షలు అన్నీ కూడా అవగాహనకు వస్తాయని అన్నారు. కొత్త తరాన్ని కూడా పార్టీకి అనుసంధానం చేయాలనీ కోరారు. ఇక కూటమిలోని మిగిలిన పార్టీలతో కలసి పనిచేయాలని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు వస్తాయని ఓపిగ్గా వెయిట్ చేయాలన్నారు.
