
పారిస్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత్ కు గర్వకారణమైన ఘట్టం చోటుచేసుకుంది. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం యునెస్కో భారత ప్రతినిధి విశాల్ వర్మ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఇది సరైన గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘ప్రధాని ఎక్స్’లో చేసిన పోస్టులో…
రాజ్యాంగ దినోత్సవం రోజున పారిస్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగడం దేశానికి ఎంతో గర్వకారణం. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు కోట్లాది మందికి నేటికీ బలం, ప్రేరణ అని వ్యాఖ్యానించారు. అలాగే పౌరులు రాజ్యాంగపరమైన కర్తవ్యాల పట్ల మరింత అప్రమత్తతగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని తన లేఖలో ఉద్ఘాటించారు. 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను అధికారికంగా ‘రాజ్యాంగ దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2019లో పార్లమెంట్ ప్రవేశ ద్వారంలో సాష్టాంగం చేసిన ఆ సందర్భాలను మోడీ గుర్తుచేశారు. రాజ్యాంగ పట్ల ఉన్న గౌరవానికి అవి నిదర్శనమని తెలిపారు.
అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ సభ కృషిని స్మరించుకున్నారు. రాజ్యాంగ రచనలో మహిళా సభ్యుల పాత్రను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇంకా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన అద్భుత సేవలను కొనియాడారు.
భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందగా… 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడమే లక్ష్యమన్నారు. అలాగే ఆర్యభట్ట -ఖగోళ శాస్త్రజ్ఞుడి విగ్రహాన్ని 2016లో యూనెస్కో ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.
