Let's talk: editor@tmv.in
పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Shaik Mohammad Shaffee
21 నవంబర్, 2025

ప్రతీ కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారుచేసే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని, ప్రజలను చైతన్య పరిచి, పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశా నిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఉన్న సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ అధికారులు, 26 జిల్లాల జనరల్ మేనేజర్‌లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు తగ్గట్టుగా, వారి లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. ప్రతీ కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. క్షేత్ర స్థాయిలో రీజనల్ మీటింగ్స్ పెట్టి, అవగాహన పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్ర స్థాయి సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చే విధంగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు అనుసంధానం చేసి పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన చేయూతను ఇచ్చి, ఆలోచన నుంచి ఆచరణ వరకు పెట్టుబడిదారులకు సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాలపై అధికారులందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలని, అలా ఉన్నప్పుడే, పెట్టుబడులు పెట్టాలని ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమాచారం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రోత్సాహం అందుతుందని మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రతీ ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగిందన్నారు. అవసరమైన మానవ వనరులను, మౌలిక సదుపాయాలను పరిశ్రమల అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని తెలిపిన మంత్రి, శిక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విషయంలో ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, హబ్ సేవలను సమర్ధవంతంగా వాడుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారానికి ఒక రోజు.. కచ్చితంగా సిబ్బంది అందరూ ఆఫీస్‌లో ఉండాల్సి ఉంటుందని, ఫీల్డ్ వర్క్‌పైనే కాదు ఆఫీసుల్లో జరిగే కార్యకలాపాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఎవరో ఒక అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండి, ఔత్సాహికులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు కాబోయే పరిశ్రమలపై అందరూ దృష్టి సారించాలన్నారు. ప్రతీ వారంలో, శనివారం అధికారులు అందరూ అందుబాటులో ఉండాల్సిందేనని, రెండవ శనివారం మినహాయింపు ఉంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలను, రిసీవ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాళ్లకు కావాల్సిన సహకారం ఇవ్వాలని సూచించారు. రుణ సదుపాయాలతో పాటుగా అనుమతుల విషయంలో అధికారులు అందుబాటులో ఉండి వివరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కార్యక్రమాలపై అధికారులు అందరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంటుందని, మారుతున్న పారిశ్రామిక విధానాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువ పరిశ్రమలు రావాలి అంటే మనం మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. ఆచరణలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులను ఇచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకు వెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్, డైరెక్టర్ శుభమ్ బన్సాల్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొనగా, 26 జిల్లాల ఉన్నతాధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ - Tholi Paluku