
పారిశుధ్య పనులు పక్కాగా పూర్తి చేయించాలి: సైబరాబాద్ కమిషనర్
నగరంలో పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దీంతో బుధవారం తెల్లవారుజామునే చార్మినార్, కుత్బుల్లాపూర్ వంటి జోన్లలో అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి, పారిశుధ్య పనులను మరియు 100 శాతం చెత్త సేకరణను స్వయంగా పర్యవేక్షించారు.
కుత్బుల్లాపూర్ జోన్‌లో ఉదయం ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. డీసీ జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని హెచ్‌ఎంటీ రోడ్ నుంచి అయోధ్యనగర్ ఎక్స్ రోడ్ వరకు శానిటేషన్ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పరిశీలన సందర్భంగా కమిషనర్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి ప్రాంతంలో జరుగుతున్న శుభ్రత పనుల పురోగతిని ఆరా తీశారు. ప్రతి రోజు క్రమబద్ధమైన శానిటేషన్ నిర్వహణ జరగాలని, చెత్త పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గృహాల నుంచి మాత్రమే కాకుండా వాణిజ్య సముదాయాల నుంచి కూడా 100 శాతం డోర్-టు-డోర్ చెత్త సేకరణను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా చెత్త సేకరణ వాహనాల సమయపాలన, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య పనుల నాణ్యతపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీధులు, కాలనీలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతంలో పరిశుభ్రత ప్రమాణాలు మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం మున్సిపల్ శాఖ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేసి కుత్బుల్లాపూర్ జోన్‌ను పరిశుభ్రతలో ఆదర్శంగా నిలబెట్టాలని ఆమె సూచించారు.
