Let's talk: editor@tmv.in
పారిశుధ్య పనులపై చార్మినార్ జోన్‌లో కమిషనర్ ఆర్వీ. కర్ణన్‌ తనిఖీలు

పారిశుధ్య పనులపై చార్మినార్ జోన్‌లో కమిషనర్ ఆర్వీ. కర్ణన్‌ తనిఖీలు

Gaddamidi Naveen
19 ఫిబ్రవరి, 2026

పవిత్ర రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో, నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన చార్మినార్ జోన్‌లో పారిశుధ్య నిర్వహణను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ బుధ‌వారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు అదనపు కమిషనర్ రవికిరణ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రముఖ పర్యాటక, ప్రార్థనా కేంద్రాలుగా పేరుగాంచిన చార్మినార్ పరిసరాలు, మక్కా మసీదు చుట్టుపక్కల ప్రాంతాలు, మదీనా బిల్డింగ్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రంజాన్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో భక్తులు, పర్యాటకుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. పరిశీలన సందర్భంగా ప్రస్తుత సానిటేషన్ సిబ్బంది నియామకం, రూట్ మానిటరింగ్ విధానం, రోడ్ల ఊడ్చే ప్రమాణాలు, దాని తరచుదనం వంటి అంశాలను సమీక్షించారు. ముఖ్యంగా వాణిజ్య కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాల నుంచి చెత్త సకాలంలో తొలగింపుపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రధాన జంక్షన్లు, పాదచారుల మార్గాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయ‌న‌ సూచించారు.

అలాగే డ్రైనేజీ కాల్వల్లో మురుగునీరు, చెత్త పేరుకుపోకుండా ముందస్తు శుభ్రత చర్యలు చేపట్టాలని, సర్కిల్, జోనల్ స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది హాజరు, పనితీరును రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించి, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచాలని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిశుభ్రత చర్యలకు పౌరులు, వ్యాపారులు సహకరించాలని, తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని క‌మిష‌న‌ర్ తెలిపారు.