Let's talk: editor@tmv.in
పారా ఒలింపిక్ పతక విజేత శీతల్ దేవి రికార్డు

పారా ఒలింపిక్ పతక విజేత శీతల్ దేవి రికార్డు

Koripelli Aditya
8 నవంబర్, 2025

జమ్మూ కశ్మీర్‌కు చెందిన 18 ఏళ్ల పారా ఒలింపిక్ పతక విజేత శీతల్ దేవి తొలిసారిగా సాధారణ క్రీడాకారిణులతో పోటీ పడే అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైంది. వచ్చే నెల జిద్దాలో జరగనున్న ఆసియా కప్ మూడవ స్టేజ్ జూనియర్ ఆర్చరీ జట్టులో చోటు దక్కించుకుంది. నాలుగు రోజుల పాటు జరిగిన జాతీయ ఎంపిక ట్రయల్స్‌లో 60 మందికిపైగా సాధారణ ఆర్చర్లతో పోటీపడి మహిళల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం సాధించింది.

ఫోకోమీలియా అనే అరుదైన జన్మజాత వైకల్యం కారణంగా చేతులు లేకుండా జన్మించిన శీతల్, ఇటీవల తన దీర్ఘకాల కలను సాకారం చేసుకుంది. ‘పోటీలు మొదలుపెట్టినప్పుడు చిన్న కల ఉండేది. ఒకరోజు సాధారణ క్రీడాకారులతోపాటు ఆడాలని. మొదటి ప్రయత్నంలో సాధ్యపడలేదు, కానీ ప్రతి ఓటమి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాను. ఈ రోజు ఆ కల మరో అడుగు దగ్గరైంది’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది.

2022లో గోవాలో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో సాధారణ ఆర్చర్లతో తొలి ప్రయత్నం చేసినా జట్టులో చోటు దక్కలేదు. సెప్టెంబర్‌లో ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ టర్కీకి చెందిన ఓజ్నూర్ క్యూర్ గిర్దిని 146-143తో చిత్తు చేసింది.

ఇది ఆమె మూడో పతకం. ఇంతకు ముందు టోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ బ్రాంజ్, బ్రిటన్ జోడీ గ్రిన్‌హామ్, నాథన్ మెక్‌క్వీన్‌లను 152-149తో ఓడించి విజయం సాధించింది. ఫైనల్‌లో శీతల్ స్థిరత్వమే కీలకం. మొదటి ఎండ్ 29-29తో డ్రా కాగా, రెండో ఎండ్‌లో మూడు పర్‌ఫెక్ట్ టెన్‌లతో 30-27 ఆధిక్యం పొందింది. మూడో ఎండ్‌లో మళ్లీ 29-29తో డ్రా అయ్యింది. నాలుగో ఎండ్‌లో 28కే పరిమితమైంది, గిర్ది 29 సాధించింది. మొత్తం 116-114తో ఆధిక్యంలో ఉండగా, చివరి ఎండ్‌లో మూడు పర్‌ఫెక్ట్ బాణాలతో 30 సాధించి తొలి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది.