Let's talk: editor@tmv.in
పారా అథ్లెట్ల ప్రదర్శన స్ఫూర్తిదాయకం: ప్రధాని మోడీ

పారా అథ్లెట్ల ప్రదర్శన స్ఫూర్తిదాయకం: ప్రధాని మోడీ

Shaik Mohammad Shaffee
7 అక్టోబర్, 2025

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్లు సాధించిన చారిత్రక విజయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులు ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభ, పోరాట పటిమ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు, ముఖ్యంగా యువతకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ఆయన కొనియాడారు. ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

క్రీడాకారులకు ప్రధాని అభినందనలు

ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా పారా అథ్లెట్లను అభినందించారు. "ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మన పారా అథ్లెట్ల ప్రదర్శన చాలా ప్రత్యేకమైనది. భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శనతో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలతో సహా మొత్తం 22 పతకాలను గెలుచుకుంది" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన సందేశంలో ఈ విజయం కేవలం క్రీడా ఘనత మాత్రమే కాదని, మానవ సంకల్పం, ధైర్యానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. "క్రీడాకారులకు నా అభినందనలు. వారి విజయం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. వారిని చూసి నేను గర్విస్తున్నాను. వారి భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని తెలిపారు. ముఖ్యంగా భారతదేశంలోనే ఈ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. "ఢిల్లీలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడం భారతదేశానికి గర్వకారణం. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న దాదాపు 100 దేశాల క్రీడాకారులు, సహాయక సిబ్బందికి నా కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

కాగా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పారా అథ్లెట్ల ప్రదర్శన గత రికార్డులను అధిగమించింది. 2019 దుబాయ్‌లో 9 పతకాలు, 2023 పారిస్‌లో 10 పతకాలు, 2024 కోబేలో 17 పతకాలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 22 పతకాలు సాధించడం భారత క్రీడా రంగంలో పారా క్రీడల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలకు మద్దతు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రతిభను ప్రోత్సహించే విధానాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పారా అథ్లెట్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడం ద్వారానే ఈ చారిత్రక విజయాలు సాధ్యమయ్యాయని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పారా అథ్లెట్ల అసాధారణ ప్రదర్శన.. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని నిరూపించాయి. వారి నిబద్ధత, పట్టుదల యావత్ దేశానికి స్ఫూర్తిని అందిస్తూ, మరింత శక్తివంతమైన క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి దోహదపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారత పారా అథ్లెట్లు ప్రపంచ వేదికలపై మరిన్ని విజయాలను సాధించాలని దేశంలోని క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు.

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 104 దేశాల నుండి 2,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారతదేశం నుండి 73 మంది సభ్యుల బృందం (54 మంది పురుషులు, 19 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా వేసిన మోండో ట్రాక్‌పై తొమ్మిది రోజుల పాటు జరిగిన హోరాహోరీ పోటీలలో 35 ప్రపంచ రికార్డులు, 104 ఛాంపియన్‌షిప్ రికార్డులు సృష్టించారు. పారిస్ 2023లో నమోదైన ప్రపంచ రికార్డులకు (35) ఇది సమానం. గత ఏడాది జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ఈవెంట్ కంటే 14 రికార్డులు ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 44 దేశాలు కనీసం ఒక స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, 63 దేశాలు కనీసం ఒక పతకాన్ని సాధించి స్వదేశానికి తిరిగి వెళ్లాయి

పారా అథ్లెట్ల ప్రదర్శన స్ఫూర్తిదాయకం: ప్రధాని మోడీ - Tholi Paluku