Let's talk: editor@tmv.in
పారా అథ్లెటిక్స్ ఫైనల్‌కు దీప్తి జీవన్‌జీ

పారా అథ్లెటిక్స్ ఫైనల్‌కు దీప్తి జీవన్‌జీ

Shaik Mohammad Shaffee
28 సెప్టెంబర్, 2025

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 ఆతిథ్య దేశం భారత్‌లో ఘనంగా ప్రారంభమైంది. భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

తెలంగాణకు చెందిన 22 ఏళ్ల ఈ క్రీడాకారిణి రౌండ్ 1లో జరిగిన రెండో హీట్‌లో 58.35 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆమె ఈ సీజన్‌లో నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. మొదటి హీట్‌లో వెనిజులాకు చెందిన లియోనెలా కొరొమోటో వెరా కొలినా 57.10 సెకన్ల టైమింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. ఇది కూడా ఆమె సీజన్ బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుత ప్రపంచ రికార్డు హోల్డర్, టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ మొదటి హీట్‌లో 57.88 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. పారిస్ పారాలింపిక్స్ 2024లో ఆమె నెలకొల్పిన ప్రపంచ రికార్డు (54.96 సెకన్లు) కంటే ఇది తక్కువ సమయం. మొదటి హీట్‌లో ఉక్రెయిన్‌కు చెందిన యులియా షులియార్ (58.01 సెకన్లు) మూడో స్థానం దక్కించుకోగా, రెండో హీట్‌లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన డయానా వివెన్స్ (59.41 సెకన్లు), ఆస్ట్రేలియాకు చెందిన టెలాయా బ్లాక్‌స్మిత్ (1:00.10 సెకన్లు) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.

ఫైనల్‌కు అర్హత సాధించిన క్రీడాకారులు

క్వాలిఫికేషన్ నియమం ప్రకారం, ప్రతి హీట్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అథ్లెట్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. వీరితో పాటు ఆ తర్వాతి లిస్టులో ఉన్న అత్యంత వేగవంతమైన మరో ఇద్దరు అథ్లెట్‌లు కూడా ఫైనల్‌కు చేరుతారు. ఈక్వెడార్‌కు చెందిన మేయర్లీ మిండా (58.98 సెకన్లు), పోర్చుగల్‌కు చెందిన కరీనా పైమ్ (59.61 సెకన్లు) కూడా అర్హత సాధించిన క్రీడాకారులతో పాటు ఫైనల్ రౌండ్‌లో పతకం కోసం పోటీపడనున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి జీవన్‌జీ గతంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ఆమె మేధో వైకల్యం ఉన్న అథ్లెట్ల విభాగమైన టీ20 కేటగిరీలో పోటీపడుతోంది. గతంలో 2024 మే నెలలో జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీప్తి 400 మీటర్ల టీ20 రేసులో 55.07 సెకన్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాగే పారిస్ పారాలింపిక్స్ 2024లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ పతకాల వేటను దీప్తి జీవన్‌జీ శుభారంభం చేసింది. ఆమె ఇప్పుడు ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి మరో పతకాన్ని అందించాలని భారత క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

భారత చరిత్రలో అతిపెద్ద పారా అథ్లెటిక్స్ ఈవెంట్

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 104 దేశాల నుండి 2,200 మందికి పైగా పారా అథ్లెట్‌లు పాల్గొననున్నారు. మొత్తం 186 మెడల్ ఈవెంట్‌లను కలిగి ఉన్న ఈ టోర్నమెంట్, భారత చరిత్రలో అతిపెద్ద పారా అథ్లెటిక్స్ ఈవెంట్. ఇది లాస్ ఏంజిల్స్ 2028 పారాలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ఒక ముఖ్య వేదిక. భారత పారా అథ్లెటిక్స్ బృందం ఈ ఛాంపియన్‌షిప్స్‌లో అతిపెద్ద బృందంతో పాల్గొంటోంది. గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో 18 పతకాలు సాధించిన భారత్, ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.