Let's talk: editor@tmv.in
పాయకరావుపేట అభివృద్ధికి మహర్దశ.. రూ. 61 కోట్లతో మౌలిక వసతుల కల్పన: మంత్రి అనిత

పాయకరావుపేట అభివృద్ధికి మహర్దశ.. రూ. 61 కోట్లతో మౌలిక వసతుల కల్పన: మంత్రి అనిత

Panthagani Anusha
15 మార్చి, 2026

పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయ కమిటీ, క్లస్టర్ యూనిట్ ఇన్‌చార్జిలతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాయకరావుపేట నియోజకవర్గ రూపురేఖలు మారేలా భారీగా నిధులు మంజూరవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా యస్‌.రాయవరం మండలంలోని పెద్దఉప్పలం-లింగరాజుపాలెం మధ్య వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే కోటవురట్ల మండలం ఇందేశమ్మవాక వద్ద కొండను తొలిచి రహదారి నిర్మాణానికి రూ.16 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులు ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల సాకారం కావడానికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.

వైద్యం, విద్యారంగాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని రూ.32.80 కోట్ల వ్యయంతో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు ట్రోమా కేర్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. అదేవిధంగా పెనుగొళ్ళు ఆసుపత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యారంగంలో భాగంగా జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.

ఉపాధి అవకాశాలను పెంచే దిశగా నక్కపల్లి మండలంలో ‘స్వయం’ పేరుతో డ్రై ఫిష్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాజయ్యపేటలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ నెల 23న నిర్వహించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

పాయకరావుపేట అభివృద్ధికి మహర్దశ.. రూ. 61 కోట్లతో మౌలిక వసతుల కల్పన: మంత్రి అనిత - Tholi Paluku