Let's talk: editor@tmv.in
పాము పడగలా నక్సలిజం విస్తరించింది:అమిత్ షా

పాము పడగలా నక్సలిజం విస్తరించింది:అమిత్ షా

Pinjari Chand
14 డిసెంబర్, 2025

నక్సలిజం అభివృద్ధి మార్గంలో అడ్డంకిగా పాము పడగలా విస్తరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు ఎత్తుకున్న వారికి, గిరిజనులకు కూడా, భద్రతా దళాలకూ నక్సలిజం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల ప్రభావిత బస్తర్ డివిజన్‌ను వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

బస్తర్ జిల్లా కేంద్రం జగదల్పూర్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన ‘బస్తర్ ఒలింపిక్స్–2025’ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు)తో సంబంధం ఉన్నవారు ఆయుధాలు విడిచి ప్రధాన స్రవంతిలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ‘రెడ్ టెర్రర్’ను 2026 మార్చి 31 నాటికి పూర్తిగా అంతం చేస్తాం. ఆ లక్ష్యానికి ఇప్పుడు చేరువలోనే ఉన్నామని అమిత్ షా తెలిపారు. నేను 2024లో బస్తర్ ఒలింపిక్స్‌కు వచ్చాను. 2025లో కూడా వచ్చాను. 2026లోనూ తప్పకుండా వస్తాను. అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు, దేశమంతటా నక్సలిజం పూర్తిగా మాయం అయి ఉంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నక్సలిజం అంతంతోనే కాదు ఆ తర్వాత బస్తర్‌లో అభివృద్ధి యుగం ప్రారంభమవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాంకేర్, కొండాగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతేవాడ—ఈ ఏడు జిల్లాలను 2030 డిసెంబర్ నాటికి దేశంలోనే అత్యంత ఆధునిక గిరిజన జిల్లాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి మౌలిక వసతులు కల్పిస్తాం

పక్కా ఇళ్లు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, నెలకు 5 కిలోల ఉచిత రేషన్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని అమిత్ షా తెలిపారు. ప్రతి గ్రామానికి రహదారి కనెక్టివిటీ, ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయాలు, బలమైన ప్రాథమిక–సామూహిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను సహకార పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తిలో బస్తర్‌లోని ఏడు జిల్లాలను దేశంలోని గిరిజన జిల్లాలన్నింటిలోనూ అగ్రస్థానానికి తీసుకువస్తామని చెప్పారు. దీనివల్ల గిరిజనుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.

బస్తర్‌లో కొత్త పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు, దేశంలోనే అత్యుత్తమ క్రీడా సముదాయం, ఆధునిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకం ప్రారంభిస్తామని చెప్పారు.

లొంగిపోయిన నక్సలైట్లు, మావోయిస్టుల హింసలో గాయపడినవారికి ఆకర్షణీయమైన పునరావాస పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

నక్సలిజం పాము పడగలా విస్తరించి ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. అది అంతమైతే, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి నేతృత్వంలో బస్తర్‌లో అభివృద్ధి అధ్యాయం ప్రారంభమవుతుందని అమిత్ షా అన్నారు. ఇంకా ఆయుధాలు పట్టుకున్నవారికి ఆయన విజ్ఞప్తి చేస్తూ, తమ కుటుంబం, సమాజ భవిష్యత్తు కోసం ప్రధాన స్రవంతిలో చేరాలని కోరారు. నక్సలిజం ఎవరికీ మేలు చేయదు. శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని పునరుద్ఘాటించారు.

బస్తర్‌లో బడి గంటల శబ్దం వినిపిస్తోంది

ఒకప్పుడు తుపాకుల మోగుడు వినిపించిన చోట ఇప్పుడు పాఠశాల గంటల శబ్దం వినిపిస్తోందని, అభివృద్ధి కలగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు రహదారులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.

‘లాల్ సలాం’ నినాదాల స్థానంలో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు మారుమోగుతున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 2,000 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. గిరిజన సమాజ నాయకుల పాత్రను ప్రశంసిస్తూ, ఇంకా ఆయుధాలు పట్టుకున్న యువతను ఒప్పించి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కోరారు. బస్తర్ ఒలింపిక్స్‌లో 700 మందికి పైగా లొంగిపోయిన నక్సలైట్లు పాల్గొనడం, ఐక్యతకు, ‘న్యూ ఇండియా’కు నిదర్శనమని చెప్పారు.

బస్తర్ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదని, అక్కడి ఆహారం, పర్యావరణం, కళలు, సంగీత వాయిద్యాలు, నృత్యాలు, సంప్రదాయ క్రీడలు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. నక్సల్స్ భీభత్సంతో అంతరించిపోతున్న పండుగలు, పాటలను ప్రభుత్వం తిరిగి ప్రోత్సహిస్తోందని తెలిపారు. 2026లో జరిగే బస్తర్ ఒలింపిక్స్ నాటికి, బస్తర్ పూర్తిగా ఉగ్రవాదం లేని ప్రాంతంగా మారుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

పాము పడగలా నక్సలిజం విస్తరించింది:అమిత్ షా - Tholi Paluku