Let's talk: editor@tmv.in
పాపికొండల అడవిలోకి ‘కూర్మపురం’ పెద్దపులి

పాపికొండల అడవిలోకి ‘కూర్మపురం’ పెద్దపులి

Panthagani Anusha
17 ఫిబ్రవరి, 2026

తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కొన్నాళ్ల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన మూడేళ్ల మగ పులి ఎట్టకేలకు తన సహజ సిద్ధమైన అటవీ ఆవాసానికి చేరుకుంది. గత కొద్దిరోజులుగా విశాఖ జూలో పర్యవేక్షణలో ఉన్న ఈ వన్యప్రాణిని శనివారం రాత్రి పాపికొండలు జాతీయ ఉద్యానవనంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు.

ఈ నెల 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కూర్మపురం గ్రామంలోకి ప్రవేశించిన ఈ పులి జనావాసాల్లో అడుగుపెట్టి తీవ్ర కలకలం రేపింది. అంతకుముందు పశువులపై దాడి చేసి చంపిన గ్రామస్థులు ప్రాణభయంతో వణికిపోయారు. అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి పులిని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

వైద్య పరీక్షల అనంతరం అడవిలోకి

పట్టుబడిన పులిని తొలుత విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కు తరలించారు. అక్కడ పశు వైద్య నిపుణులు పులి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. అది పూర్తి ఆరోగ్యంగా ఉందని అడవిలో వేటాడి బతకగలదని ధృవీకరించిన తర్వాతే జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నుంచి అధికారులు అనుమతులు పొంది. పులి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు వీలుగా దాని మెడకు జీపీఎస్ రేడియో కాలర్‌ను అమర్చి అడవిలో వదిలేసారు.

సురక్షిత ఆవాసంగా పాపికొండలు

కాగా పులిని తిరిగి అడవిలో వదిలిపెట్టడం కోసం పాపికొండలు జాతీయ ఉద్యానవనాన్ని ఎంపిక చేయడం వెనుక బలమైన కారణాలున్నాయని అధికారులు తెలిపారు. అక్కడ విస్తారమైన అడవి, పులికి సరిపడా ఆహారం అందుబాటులో ఉండటంతో పాటు మానవ సంచారం అతి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

నిరంతర నిఘా.. ప్రజలకు విజ్ఞప్తి

పులి మళ్లీ జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. అదేవిధంగా అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వన్యప్రాణుల కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి" అని అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.