Let's talk: editor@tmv.in
పాపికొండలు - గోదావరి ఒడిలో మనోహరమైన ప్రయాణం

పాపికొండలు - గోదావరి ఒడిలో మనోహరమైన ప్రయాణం

Dantu Vijaya Lakshmi Prasanna
15 డిసెంబర్, 2025

గోదావరి నది ఒడ్డున అద్భుతమైన కొండల దారిలో విచిత్రమైన వంపులు, నదీ ప్రవాహం మధ్యలో గిరగిర తిరుగుతూ మేఘాలను తాకే కొండచరియలతో కూడిన ప్రకృతి అందాల స్వర్గం పాపికొండలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో వ్యాపించిన ఈ ప్రాంతం, నిత్యం పచ్చని అడవులు, నీలి రంగు నది, నది మధ్యగా కదిలే బోట్ల ప్రయాణంతో ఏ పర్యాటకుడినైనా మంత్రముగ్ధులను చేస్తుంది.

పాపికొండల్లో గోదావరి నది అత్యంత సన్నని మార్గంలోకి ప్రవేశించి భారీ కొండల మద్య వయ్యారంగా వాలుతూ ప్రవహించే దృశ్యం ప్రపంచ సుందరాల సరసన నిలవగలంత అపురూపం. ఇది కేవలం ఒక టూరిస్టు స్పాట్ కాదు. ప్రకృతి, ఆదివాసి సంస్కృతి, సాహసాలు, ఆధ్యాత్మికం, నదీ సౌందర్యం అన్నీ ఒక్కచోట కలిసిన ప్రాంతం.

గోదావరి ఒడిలో అపురూపమైన ప్రకృతి

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి అందాలను తమలో దాచుకున్న అనేక ప్రాంతాలు ఉన్నా, గోదావరి ఒడిలో నిశ్శబ్దంగా మన కోసం ఎదురుచూస్తూ నిలిచే పాపికొండలు మాత్రం ప్రత్యేకమైనవి. తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఖమ్మం జిల్లాల మధ్య విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణులు, గోదావరి నది వంపుల్లో నాట్యం చేసే నీలి నీరు, అటవీ రంగు అందాలు, కొండల సోయగాలతో కలిసిపడి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ నది ప్రవాహం కొండల మధ్యగా నెమ్మదిగా సాగుతూ, మధ్యలో అప్పుడప్పుడూ నీటి శబ్దంతో మారుమోగుతుంటే, చూసిన వారికి ప్రకృతిపైన ప్రేమ మరింతగా పెరుగుతుంది. పాపికొండల దృశ్యం మొదటిసారి చూసే వారికి ఇది మన దేశంలోనే కాక ప్రపంచంలోనూ అత్యంత అందమైన నది కన్యాన్ ప్రాంతాలలో ఒకటిగా అనిపిస్తుంది.

పాపికొండల పర్యటనలో అత్యంత ముఖ్యమైన అనుభవం గోదావరి బోటు ప్రయాణం. పోలవరం, పచ్చులూరు, గాందీపల్లి, భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ బోటు క్రూయిజ్‌లో నది మధ్యలో నిలుచున్న పెద్ద పెద్ద కొండల మధ్యగా ప్రయాణించడం ఒక అద్భుత అనుభూతి. వయ్యారంగా సాగుతున్న నదిలో గాలి సవ్వడి, కొండల నిశ్శబ్దం, అప్పుడప్పుడూ వచ్చే పక్షుల కిలకిల స్వరాలు కలిసి ఒక మంత్ర ముగ్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయి. బోటు ప్రయాణం చేస్తూ చుట్టూ కనిపించే పచ్చదనంతో నిండిన అడవులు, వాటిలో కనిపించే జంతువులు, పక్షులు, తీరప్రాంతాల్లో జీవించే గిరిజనుల సాదాసీదా జీవనం అన్నీ కలిపి పాపికొండల ప్రత్యేకతను మరింత పెంచుతాయి. ఈ ప్రాంతం వైల్డ్‌లైఫ్ సాంక్చ్యురీగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చిరుత పులులు, దుప్పులు, తోడేళ్లు, కోతులు అనేక రకాల పక్షులు, ఔషధ మొక్కలు విస్తారంగా కనిపిస్తాయి.

ప్రకృతి రమ్యంలోనే కాదు, పాపికొండలలో ఆధ్యాత్మికతకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి పొసమ్మ గండి, పట్టిసీమ, పేరంటాలపల్లి రామాలయం, హనుమాన్ ఆలయం, చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలు చరిత్రను మోసుకెళ్తాయి. గిరిజన తెగల సంస్కృతి, వారి నృత్యాలు, సాంప్రదాయ వంటకాలు పర్యాటకులను ఆకట్టుకునే అంశాలలో ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో జలతరంగిణి వంటి చిన్న జలపాతాలు, అడవి దారుల్లో చిన్న ట్రెక్కింగ్ మార్గాలు, నది ఒడ్డున కనిపించే క్యాంపింగ్ స్పాట్లు, రాత్రి విడిది కోసం చిన్న చిన్న కుటీరాలు ఇలా అన్నీ సాహస ప్రియులకు కూడా మంచి అనుభవాన్ని అందిస్తాయి.

పాపికొండలను సందర్శించడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఈ కాలంలో వాతావరణం చల్లగా, నది ప్రశాంతంగా ఉంటుంది. రాజమండ్రి నుంచి పాపికొండ ప్రాంతం సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు పెద్దగా ఉండకపోవడం వల్ల కుటుంబంగా, స్నేహితులతో, విద్యార్థులతో ఈ ప్రాంతాన్ని తరచుగా సందర్శించే వారు చాలా మంది ఉంటారు.

మొత్తానికి, పాపికొండలు కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, మనసుకు నూతన శాంతి ఇచ్చే ప్రకృతి ఒడిలోని ఆనందకర విహారం. గోదావరి నది గుండెల్లో కొండల మధ్య దాక్కున్న ఈ రమణీయ ప్రదేశాన్ని ఒకసారి సందర్శిస్తే జీవితాంతం మరిచిపోలేని అనుభూతిగా నిలుస్తుంది. నిత్యజీవితపు పరుగుపందెం నుంచి ఒక్క అడుగు వెనక్కి వేస్తూ, ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం పాపికొండలు నిజమైన స్వర్గం.

పాపికొండలు ఎక్కడ ఉన్నాయి?

పాపికొండలు తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్నాయి. నది ఒడ్డున వరుసగా నిల్చున్న మూడు పెద్ద కొండ శ్రేణులు, వాటి మడతలు, లోయలు, నది వంగి వంగి సాగే తీరు చూసి పాపాలు పోతాయని నమ్మకం ఉండడంతో “పాపికొండలు” అనే పేరొచ్చింది. ఇక్కడి గోదావరి ప్రవాహం ప్రపంచంలోని కొన్ని ప్రాచీన నదీ కన్యాన్ ప్రాంతాలను తలపిస్తుంది.

పాపికొండ బోటు ప్రయాణం - ప్రధాన ఆకర్షణ

పాపికొండలకు వెళితే తప్పకుండా చేయాల్సింది రివర్ క్రూయిజ్, బోటు రైడ్. పోలవరం, పచ్చులూరు, గాందీపల్లి నుండి (ఆంధ్రా వైపు ) బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. పురుషోత్త పట్టణం నుండి పాపికొండలకు నిరంతరం బోటు సదుపాయం ఉంటుంది. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఉదయం బయలుదేరి, ప్రకృతి అందాలను తిలకించి తిరిగి రాత్రికి మన గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. భద్రాచలం, పూనుగుపాడు,కుంట (తెలంగాణ వైపు నుండి) నుండి పాపికొండలకు బోటు ప్రయాణం ఉంటుంది.

బోటు* *ప్రయాణం విశేషాలు

బోటు నది మధ్యలో కొండల గుండా ప్రయాణించే సాహసోపేత అనుభవాన్ని కలిగిస్తుంది.

జలప్రవాహం స్వరాలు, చెట్ల సవ్వడి, కొండల్లో మారుమోగే నిశ్శబ్దం, వరుసగా నిలుచున్న పచ్చని కొండల దృశ్యం, ఫోటోగ్రఫీకి పరిపూర్ణమైన లొకేషన్లు, బోటులో అందించే స్థానిక వంటకాలు, నది దాటిన తర్వాత పాపికొండ వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ ప్రాంతంలో చిన్న అడవి వాకింగ్ ఉంటాయి. పోసమ్మగండి గోదావరి నది ఒడ్డున అద్భుతమైన సహజ అందాలు, గిరిజన భక్తి, శతాబ్దాల నాటి సంప్రదాయాలను కలిసిన పవిత్ర స్థలం. ఇది పాపికొండల ప్రాంతంలో భాగంగా ఉండి, గిరిజన సమాజం చేత పవిత్రమైన దేవస్థానం. సహజ రీతిలో ఏర్పడిన రాతి నిర్మాణాలు, నది తీరం మీద ఏర్పడిన శాంతమైన వాతావరణంతో ప్రత్యేకతను సంపాదించింది. సహజంగా పుట్టినట్లున్న రాతి మండపంలో పూజారులు నిర్వహించే ఆచారాలు, స్థానిక తెగలు పాటించే పూజావిధులు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. గోదావరి ప్రవాహం పక్కనే ఉండటం వల్ల ఈ ప్రాంతం ఫోటోల కోసం, నిశ్శబ్దంగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడానికి ఎంతో అనువుగా ఉంటుంది.

ఆధ్యాత్మికతతో పాటు, పోసమ్మగండి ప్రాంతం పర్యాటకులకు చిన్న పర్వత దారులు, నది తీరం అడవి బాటలు, గిరిజన కళాకారుల తయారీ వస్తువులు, స్థానిక సంస్కృతి ప్రత్యేక ఆకర్షణలుగా కనిపిస్తాయి. పాపికొండలు బోటు ప్రయాణంలో ముఖ్యమైన ప్రదేశం, ఇక్కడ బోటు దిగిన తర్వాత కొద్దిసేపు నడిచి చేరే దేవాలయ ప్రదేశం, పర్యాటకులకు ప్రశాంతతను అందించేలా ఉంటుంది. పోసమ్మగండి ప్రాంతం పాపికొండల అందాన్ని మరింత పెంచుతూ, గోదావరి ఒడిలో దాచుకున్న ప్రకృతి ఆధ్యాత్మిక సంపదను ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఒకసారి వచ్చినవారికి ఈ ప్రదేశం అందించే పచ్చదనం, ప్రశాంతత, భక్తి వాతావరణం మనసును ఎంతోకాలం మరిచిపోలేని అనుభూతిగా మిగులుస్తుంది.

పాపికొండ వైల్డ్‌లైఫ్ సాంక్చ్యురీ

ఇది ఈస్ట్రన్ ఘాట్స్‌లో విస్తరించి ఉన్న భారీ అడవి ప్రాంతం. ఇక్కడ కనిపించే అనేక జంతువులు , పక్షులు, వేల రకాల ఔషధ మొక్కలు నదీ తీరంలో ఉన్న గ్రామాల్లో నివసించే కొండ రెడ్డి, కొయ్య, కమ్మర వంటి ఆదివాసి తెగల జీవనశైలి కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

పర్యాటకులకు పోలవరం ప్రాజెక్ట్ మరో ఆకర్షణ గా మారనుంది. చారిత్రక సంపదగా, గోదావరి ఒడ్డున వేల ఏళ్ల చరిత్రని మోసుకెళ్ళే శాసనాలు, దేవాలయాలు కనిపిస్తాయి. గూడెం గ్రామాలు, స్థానిక గిరిజన కళలు, గిరిజన నృత్యాలు, తెగల ఆచారాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

గోదావరి నది అద్భుతమైన నడత, ప్రకృతి ఇంకా పూర్తిగా అల్లకల్లోలం కాకుండా ఉండటం. గాలి, నీరు, కొండలు – మూడు కలిసి ఇచ్చే ఆధ్యాత్మికమైన ప్రశాంతత, ఆదివాసి సంస్కృతి, వారి జీవన విధానం, పూడిపల్లి పట్టిసీమ లాంటి ప్రదేశాలు ఫోటోలకు, సినిమాలకు, డాక్యుమెంటరీలకు అద్భుత ప్రదేశంగా నిలుస్తాయి.

ట్రిప్ ప్లాన్ ఎలా చేసుకోవాలి.* *బెస్ట్ సీజన్:

అక్టోబర్, ఫిబ్రవరి అత్యుత్తమ సమయం, జూలై, సెప్టెంబర్ లో వర్షాకాల వాతావరణం, నీరు ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తాయని బోటు ప్రయాణాలపై ప్రభుత్వాలు నిషేదంవిధిస్తాయి.

బోటు రైడ్ ధరలు : రూ.900 - రూ.2500 (ప్యాకేజ్ ఆధారంగా), ఫుడ్ + ట్రావెల్: రూ.500 - రూ.1000 గా ఉంటాయి. మొత్తం ఒక వ్యక్తికి రూ..1500, రూ.3500 అవుతాయి. పిల్లలకు,పెద్దలకు దాదాపు ఒకే విధమైన ఛార్జీలు ఉంటాయి. రాజమండ్రి, భద్రాచలం, పోలవరం ద్వారా చేరవచ్చు. రాజమండ్రి నుండి పాపికొండ పాయింట్‌కు 60 నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది.

టూరిస్ట్‌లకు ముఖ్య సూచనలు

నది నీటిలో అనవసరంగా దిగకూడదు. పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్‌ను తీసుకురావద్దు, నీటిలో ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదు. అడవిలో శబ్దం చేయకండి. గిరిజనులు, వారి సంస్కృతిని గౌరవించండి. అధికారికంగా అనుమతి ఉన్న బోటులోనే ప్రయాణించండి

పాపికొండలు కేవలం ఒక టూరిస్టు స్పాట్ కాదు. ప్రకృతి ఒడిలో మనసు పునర్వసంతం అవుతుంది. గోదావరి నది వంపుల్లో సాగే బోటు, కొండల నడుమ దాగిన అందాలు, నదిపై పడి నర్తించే సూర్యకిరణాలు… ఈ ప్రయాణం ఒక్కసారైనా చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకంగా తప్పక చూడాల్సిన అద్భుతం పాపికొండలు. మరి ఈ పాపికొండల అందాల్ని మీ కుటుంబంతో కలిసి ఓ సారి చూసి రండి. పర్యాటక అనుభవాలను పదిలంగా దాచుకోండి.

పాపికొండలు - గోదావరి ఒడిలో మనోహరమైన ప్రయాణం - Tholi Paluku