
పాతాళంలో ఉన్నా.. పవన్ ఖేరాను తీసుకువస్తాం: అస్సాం సీఎం
కాంగ్రెస్ నేత పవన్‌ఖేరాపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అవసరమైతే పాతాళం నుంచి అయినా వ్యక్తులను వెతికి తీసుకురాగల సామర్థ్యం అస్సాం పోలీసులకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆరోపణలు చేయడానికి ముందు విదేశాంగ మంత్రిని అడిగి ఉండాల్సిందని కాంగ్రెస్‌ను శర్మ విమర్శించారు. ఈ వివాదానికి సంబంధించిన పత్రాలను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అందించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఖర్గే జీ వయస్సు పెరిగినా ఇంకా అలా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారం చివరకు రాహుల్ గాంధీ వరకు వెళ్లొచ్చు అని శర్మ అన్నారు. ఇదిలా ఉండగా, పవన్ ఖేరా నివాసంలో నిర్వహించిన తనిఖీలు పూర్తయ్యాయని అస్సాం పోలీసు అధికారి దేబజిత్ నాథ్ తెలిపారు. అయితే ఈ తనిఖీలపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని చెప్పారు.
రెండు రోజుల క్రితం పవన్ ఖేరా విలేకరుల సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి భార్య రింకీ భుయాన్ శర్మకు భారత్, యూఏఈ, ఈజిప్ట్ దేశాల నుంచి మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. అలాగే దుబాయ్‌లో విలాసవంతమైన ఆస్తులు, అమెరికాలోని వ్యోమింగ్‌లో కంపెనీ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను శర్మ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఖేరా విడుదల చేసిన పత్రాలు కృత్రిమ మేధస్సుతో తయారు చేసినవి, మార్పులు చేసిన చిత్రాలని పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా వర్గాల నుంచి తీసుకున్న సమాచారమని ఆరోపించింది.
పవన్‌ఖేరా హైదరాబాద్ పారిపోయాడు
ఇదే సమయంలో, ఢిల్లీలో తన నివాసంపై అస్సాం పోలీసులు తనిఖీలు నిర్వహించిన తర్వాత పవన్ ఖేరా హైదరాబాద్‌కు పారిపోయారని శర్మ ఆరోపించారు. అతను గువాహటి నుంచి పారిపోయాడు. పోలీసులు ఢిల్లీలోని అతని ఇంటికి వెళ్లారని మీడియా ద్వారా తెలిసింది. కానీ అతను హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేస్తుందని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు గువాహటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా ఖేరాపై కఠిన చర్యలు తీసుకుంటామని శర్మ హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, తమ కుటుంబాన్ని దుబాయ్‌లోని అపార్ట్‌మెంట్లతో అనుసంధానించేందుకు ఉపయోగించిన పత్రాలు స్క్రిబ్డ్ అనే డాక్యుమెంట్ ప్లాట్‌ఫారమ్ నుంచి దొంగిలించినవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని కూడా వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ నేతలు గౌరవ్‌గోగోయ్, పవన్ ఖేరాపై విదేశీ సంబంధాల ఆరోపణలు కూడా చేశారు. పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా గ్రూప్ సహాయం ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించారు.
