Let's talk: editor@tmv.in
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్: రూ. 100 కోట్ల విలువైన క్రీడా మైదానం స్వాధీనం

పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్: రూ. 100 కోట్ల విలువైన క్రీడా మైదానం స్వాధీనం

Gaddamidi Naveen
2 ఏప్రిల్, 2026

నగరంలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా బుధవారం పాతబస్తీలో మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవుపల్లి పరిధిలోని శాస్త్రిపురం కాలనీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసి, సుమారు రూ. 100 కోట్ల విలువైన 6500 గజాల క్రీడా మైదానాన్ని కాపాడింది.

అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, శాస్త్రిపురం కాలనీలోని 188 ఎకరాల హెచ్ యూడీఏ అనుమతి పొందిన లేఅవుట్‌లో, నిబంధనల ప్రకారం 6500 గజాల స్థలాన్ని క్రీడా మైదానం కోసం కేటాయించారు. అయితే, గత మూడేళ్లుగా స్థానిక కబ్జాదారులు ఈ విషయాన్ని దాచిపెట్టి, నోటరీ పత్రాల ద్వారా ఈ స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలను చేపట్టారు. గతంలో జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసినా, కూల్చివేత ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లేఅవుట్ ప్రకారం అది క్రీడా స్థలమేనని నిర్ధారించుకున్నాక, బుధవారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాణ దశలో ఉన్న ఐదు 'జీ ప్లస్ 3' అంతస్తుల భవనాలతో పాటు, రెండు చిన్న గదుల నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇప్పటికే నివాసాలు ఉంటున్న మరో రెండు భవనాలను మానవీయ కోణంలో ప్రస్తుతానికి మినహాయించారు.

కబ్జాదారుల బెదిరింపులకు భయపడకుండా ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న శాస్త్రిపురం కాలనీవాసులు, హైడ్రా చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు. కబ్జా చేసిన వారు సామాన్యులు కాదు, అడ్డుకున్న మమ్మల్ని ఎంతో భయపెట్టారు. కానీ హైడ్రా రావడంతో మా పిల్లల ఆడుకునే స్థలం మాకు దక్కిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌తో ప్రభుత్వ స్థలాలు, క్రీడా మైదానాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హైడ్రా మరోసారి హెచ్చరించింది.