
పాఠ్యాంశంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అధ్యాయం.. సీజేఐ సీరియస్
ఎనిమిదో తరగతి ఎన్సీఈఆర్టీ సామాజిక శాస్త్ర పాఠ్యాంశంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే విభాగాన్ని చేర్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై బుధవారం సుమోటోగా కేసు విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ సంస్థను ఎవరూ అప్రతిష్టపాలు చేయడానికి నేను అంగీకరించను అని కఠినంగా హెచ్చరించారు. సీజేఐ మాట్లాడుతూ ఈ విషయం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక రోజు వేచి చూస్తాం. ఇది మొత్తం సంస్థకు సంబంధించిన అంశం. బార్, బెంచ్ రెండింటికీ సంబంధించినది. నాకు అనేక కాల్స్, సందేశాలు వస్తున్నాయి. ఈ అంశంపై సుమోటోగా విచారణ చేపడుతున్నాను. ఎవరైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే, సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా ప్రయత్నం చేయడానికి అనుమతించనని తెలిపారు. న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చీ మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలు రాజ్యాంగపు మౌలిక నిర్మాణ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థలోనే అవినీతి ఉందా?
ఈ విషయాన్ని సీజేఐ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సంగ్వీ ప్రస్తావించారు. పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని బోధిస్తున్నారు. కానీ ఇతర రంగాలలో బ్యూరోక్రసీ, రాజకీయాలు వంటి వాటిలో ఉన్న అవినీతి గురించి ఒక్క మాట కూడా అందులో లేదు. అవినీతి ఈ ఒక్క సంస్థలోనే ఉందన్న భావన కలిగించేలా పాఠ్యాంశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సీజేఐ ఇది ప్రణాళికాబద్ధమైన, లోతుగా ఉన్న విషయం అనిపిస్తోంది. దీనిపై ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడే చెప్పను. సంస్థాధిపతిగా నాకు అవగాహన ఉంది. ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.
ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తన కొత్త 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యంలో ‘ది రోల్ ఆఫ్ ది జుడిషియరీ ఇన్ అవర్ సోసైటీ ’ అనే అధ్యాయాన్ని సవరించింది. ఇందులో కోర్టుల నిర్మాణం, న్యాయం అందుబాటు వంటి అంశాలతో పాటు, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు అవినీతి, కేసుల పెండింగులు వంటి అంశాలను కూడా చేర్చింది. న్యాయవ్యవస్థలో అవినీతి అనే విభాగంలో, న్యాయమూర్తులు కోర్టులోనే కాకుండా బయట కూడా తమ ప్రవర్తనకు కట్టుబడి ఉండాల్సిన నైతిక నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్ )కు లోబడి ఉంటారని పుస్తకం పేర్కొంది.
మంగళవారం, కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రత్యేక విభాగం చేర్చారు. అయితే రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాల్లో ఉన్న అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? వాటిని పక్కన పెట్టేశారా? అని ప్రశ్నించారు. ఈ పరిణామం నేపథ్యంలో సుప్రీంకోర్టు చేపట్టిన సుమోటో విచారణపై దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
న్యాయవ్యవస్థపై వివాదాస్పద అంశాలు తొలగించే అవకాశం
ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాలపై ఉన్న వివాదాస్పద భాగాలను తొలగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ ఆ పుస్తకాన్ని తన వెబ్‌సైట్ నుంచి ఉపసంహరించుకుంది. ఈ విషయంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, అభిషేక్ సింగ్‌వి ప్రస్తావనతో, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ఉన్నారు. సీజేఐ సూర్యకాంత్, పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై ఉన్న అసహ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరినీ అనుమతించబోమని వ్యాఖ్యానించారు.
కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి, కేసుల పెండెన్సీ, తగినంత న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో సుమారు 81,000 కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షల కేసులు, జిల్లా, లోయర్ కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పుస్తకం పేర్కొంది. అలాగే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 2017-2021 మధ్య 1,600కుపైగా ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది.
పాఠ్యపుస్తకంలో మాజీ సీజేఐ బీఆర్ గవాయి వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. 2025 జూలైలో న్యాయవ్యవస్థలో అవినీతి ఘటనలు ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఆ వ్యాఖ్యలను సందర్భం తప్పుగా తీసుకున్నారని, గవాయి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
ప్రభుత్వ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం, ఎన్‌సీఈఆర్టీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ, ఇలాంటి అంశాలు చేర్చేటప్పుడు సరైన పరిశీలన అవసరమని సూచించారు. అవినీతి అంశాన్ని చేర్చాల్సి ఉంటే, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మూడింటినీ సమానంగా ప్రస్తావించాల్సిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ నెలలో లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, 2016 నుంచి 2025 మధ్య సిట్టింగ్ జడ్జీలపై 8,639 ఫిర్యాదులు వచ్చాయి. 2024లో మాత్రమే సీజేఐ కార్యాలయానికి 1,170 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయపరమైన పరిశీలనలో ఉండటంతో, ఎన్‌సీఈఆర్టీ అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం పాఠ్యాంశాలను పునఃసమీక్షించి తగిన మార్పులు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చాయి.
