Let's talk: editor@tmv.in
పాఠశాలల్లో మొబైల్ ఫోన్లకు ‘నో’... ప్రపంచ దేశాల్లో సగానికి పైగా నిషేధం

పాఠశాలల్లో మొబైల్ ఫోన్లకు ‘నో’... ప్రపంచ దేశాల్లో సగానికి పైగా నిషేధం

Pinjari Chand
23 మార్చి, 2026

తరగతి గదుల్లో విద్యార్థుల ఏకాగ్రత తగ్గిపోవడం, సైబర్ బులీయింగ్ పెరుగుదలపై ఆందోళనల మధ్య ప్రపంచ దేశాల్లో సగానికి పైగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం అమలులో ఉందని యునెస్కో ఆదివారం వెల్లడించింది. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (జీఈఎం) బృందం తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 114 విద్యా వ్యవస్థలు—అంటే 58 శాతం దేశాలు పాఠశాలల్లో ఫోన్లపై జాతీయ స్థాయి నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. 2023లో ఇది కేవలం 24 శాతమే ఉండగా, 2025 నాటికి 40 శాతానికి పెరిగి, 2026 మార్చి నాటికి మరింత వేగంగా విస్తరించింది.

విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఫేస్‌బుక్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 32 శాతం టీనేజ్ అమ్మాయిలు ఇన్‌స్టాగ్రాంవాడిన తర్వాత తమ శరీరంపై అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు. అలాగే టిక్‌టాక్‌ ఆల్గోరిథమ్ ప్రతి 39 సెకన్లకోసారి బాడీ ఇమేజ్‌కు సంబంధించిన కంటెంట్, ప్రతి 8 నిమిషాలకు ఈటింగ్ డిజార్డర్లకు సంబంధించిన విషయాలను టీనేజర్లకు చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అమ్మాయిలు అబ్బాయిలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఈటింగ్ డిజార్డర్లకు గురవుతున్నారని నివేదికలో పేర్కొన్నారు. చిన్న వయసులోనే సోషల్ మీడియా వినియోగం పెరగడం, ముఖ్యంగా అమ్మాయిల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని హెచ్చరించారు.

ఇటీవల బొలీవియా, కోస్టారికా, క్రోయేషియా, జార్జియా, మాల్దీవులు, మాల్టా వంటి దేశాలు కూడా పాఠశాలల్లో ఫోన్లపై నిషేధం అమలు చేశాయి. ఫ్రాన్స్‌లో ఇప్పటికే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఫోన్ల వినియోగంపై నిషేధం ఉండగా, మరింత కఠిన నిబంధనలపై చర్చ కొనసాగుతోంది. అయితే అన్ని దేశాలు పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్లడం లేదు. కొన్ని దేశాలు పాఠశాలలకే నిర్ణయాధికారం ఇస్తూ, తరగతి గదుల్లో మాత్రమే పరిమితులు విధించడం, విద్యాపరమైన అవసరాలకు మాత్రమే అనుమతించడం వంటి విధానాలు అమలు చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ స్థాయిలో నిషేధం లేకపోయినా, 39 రాష్ట్రాలు పాఠశాలల్లో ఫోన్ల వినియోగంపై నియంత్రణ పాటిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టాలపై చర్చ కొనసాగుతోంది. పిల్లల భావోద్వేగ, మానసిక ఆరోగ్యం విద్యలో కీలకమని, సోషల్ మీడియా దాని మీద ప్రభావం మరింతగా ఉందని యునెస్కో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కూడా ఆంక్షలు విధించే దిశగా చర్యలు చేపడుతున్నాయి.