Let's talk: editor@tmv.in
పాఠశాలల్లో ఆస్బెస్టాస్ షీట్లపై శాస్త్రీయ సమీక్ష చేయండి:ఎన్జీటీ

పాఠశాలల్లో ఆస్బెస్టాస్ షీట్లపై శాస్త్రీయ సమీక్ష చేయండి:ఎన్జీటీ

Pinjari Chand
6 నవంబర్, 2025

దేశవ్యాప్తంగా పాఠశాలలు, నివాస గృహాలు, ఇతర భవనాల్లో ఉపయోగిస్తున్న ఆస్బెస్టాస్‌ షీట్లపై శాస్త్రీయ సమీక్ష చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖను ఆదేశించింది. ఈ సమీక్షను ఆరు నెలల్లో పూర్తి చేసి తగిన విధాన నిర్ణయం తీసుకోవాలని ట్రిబ్యునల్‌ సూచించింది. ఈ కేసును ఎన్జీటీ లో ఢిల్లీకి చెందిన స్కూల్ ప్లానింగ్ అర్కిటెక్చర్ డా.రాజాసింగ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.ఆయన తగిన కారణాలతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఆస్బెస్టాస్ వినియోగాన్ని నిలిపివేయాలని, భవిష్యత్తులో వారికి భద్రంగా ఉండే వనరులు అమర్చాలని పిటిషన్ కోరారు. దీంతో న్యాయవాది జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ త్యాగి, నిపుణ సభ్యుడు డా. అఫ్రోజ్‌ అహ్మద్‌లతో కూడిన బెంచ్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆస్బెస్టాస్‌ ఉత్పత్తుల తయారీ, అమరిక, నిర్వహణ, తొలగింపు, పారవేయడం తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. పిల్లల ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత. శాస్త్రీయ అనిశ్చితి ఉన్నప్పుడు కూడా “ప్రీకాషనరీ ప్రిన్సిపల్‌” (జాగ్రత్త విధానం)ను అనుసరించాలని ఆదేశించింది.,పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆస్బెస్టాస్ వాడకంపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఎన్జీటీ చట్టం, 2010లోని సెక్షన్ 20 కింద ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.

అయితే తగిన శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేశవ్యాప్తంగా ఆస్బెస్టాస్‌ షీట్ల వినియోగాన్ని తక్షణం నిషేధించడం అవసరం లేదని ట్రిబ్యునల్‌ తెలిపింది. ఫైబర్‌ సిమెంట్‌ ప్రొడక్ట్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆస్బెస్టాస్‌ సిమెంట్‌ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ తన వాదనలో ఆస్బెస్టాస్‌ సిమెంట్‌ షీట్లు సాధారణ వినియోగంలో ప్రమాదకరం కావని, ఎందుకంటే ఆ ఫైబర్లు సిమెంట్‌లో ఉంటాయని తెలిపింది.

తమ ఉత్పత్తులు ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ (1948), వాయు కాలుష్య నిరోధక చట్టం (1981), బీఐఎస్ ప్రమాణాల వంటి అన్ని చట్టబద్ధ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని, పరిశ్రమ పర్యావరణం, కార్మిక భద్రతా ప్రమాణాలు పాటిస్తోందని సమర్పించింది. అంతేకాక ఆస్బెస్టాస్‌ సిమెంట్‌ ఉత్పత్తులు చవకగా, బలంగా ఉండటంతో గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో విస్తృతంగా వాడుతున్నాయని, అవసరమైతే దశలవారీగా చర్యలు తీసుకోవాలని, ఒకేసారి నిషేధించడం వలన చిన్నతరహా పరిశ్రమలు, ఉద్యోగాలు దెబ్బతింటాయని తెలిపింది. ఎన్జీటీ కేంద్రాన్ని ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులు, భారతీయ సమాచారం ఆధారంగా సాక్ష్యాధార పూర్వక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాక, సీపీసీబీకి ఆస్బెస్టాస్‌ వ్యర్థాల సురక్షితంగా పారవేయడానికి ఎస్ఓపీ రూపొందించామని, విద్యా మంత్రిత్వశాఖకు పాఠశాలల్లో ఉన్న షీట్లను సరిగా నిర్వహించమని, కొత్తగా అమర్చే పనుల్లో బీఐఎస్ ప్రమాణాలు పాటించాలని, వ్యర్థాలను కేంద్రాలకు మాత్రమే పంపాలని సూచించింది.

ఇప్పుడెందుకు సమీక్ష

జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆస్బెస్టాస్‌ గురించి సమీక్ష కోరటానికి ఆరోగ్యపరమైన, పర్యావరణపరమైన కారణాలున్నాయి. ఇటీవలి కాలంలో పలు సంస్థలు, ఆరోగ్య నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు అస్బెస్టాస్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాఠశాలలు, ఇళ్లు, ప్రభుత్వ భవనాల్లో ఆస్బెస్టాస్‌ షీట్లు వాడటం వల్ల దీర్ఘకాలికంగా ప్రజల ఆరోగ్యానికి హానికరం అవుతోంది. ఇది నిజంగా ఎంత ప్రమాదకరం? దానిని పూర్తిగా నిషేధించాలా? లేక భద్రతా మార్గదర్శకాలు సరిపోతాయా? అనే అంశాలపై శాస్త్రీయ సమీక్ష కోరింది.

ఆస్బెస్టాస్ వల్ల కలిగే నష్టాలు

• ఆస్బెస్టాస్‌ ఫైబర్లు గాలిలో కలిసిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళితే చాలా తీవ్రమైన సమస్యలు కలుగుతాయి.

• ఇవి తక్షణమే ప్రభావం చూపవు. కానీ సంవత్సరాల తర్వాత బయటపడతాయి.

• ఆస్బెస్టోసిస్‌ : ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటం, శ్వాసకోశ సమస్యలు.

• లంగ్‌ క్యాన్సర్‌ : ఆస్బెస్టాస్‌ ఎక్స్పోజర్‌ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

• మెసోథెలియోమా : ఊపిరితిత్తులు లేదా ఉదర పొరలో ఏర్పడే అరుదైన కానీ తీవ్రమైన క్యాన్సర్‌.

• దీర్ఘకాలిక దగ్గు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి.

ఈ ఫైబర్లు పిల్లలకు ఎక్కువ సున్నితంగా ఉంటాయి. అందుకే పాఠశాలల్లో వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే 60కిపైగా దేశాలు (ఉదా: జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు) ఆస్బెస్టాస్‌పై పూర్తి నిషేధం విధించాయి. భారత్‌లో మాత్రం ‘కంట్రోల్డ్‌ యూజ్‌’ అంటే నియంత్రిత మోతాదులో వినియోగించడానికి అనుమతిస్తారు.

పాఠశాలల్లో ఆస్బెస్టాస్ షీట్లపై శాస్త్రీయ సమీక్ష చేయండి:ఎన్జీటీ - Tholi Paluku