
పాట్నా సివిల్ కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
బీహార్‌లోని పాట్నాసివిల్ కోర్టుకు గురువారం మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కోర్టు ప్రాంగణంలో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం కూడా ఇదే విధంగా ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా దానికి కొనసాగింపుగా ఈ హెచ్చరిక వచ్చింది. కోర్టు సముదాయంలో పేలుడు పదార్థాల కోసం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి. పాట్నా సివిల్ కోర్టును బాంబుతో పేల్చివేస్తామని మరోసారి బెదిరింపు వచ్చింది. గత ఐదు రోజుల్లో బాంబు బెదిరింపులు రావడం ఇది మూడోసారని పోలీసు అధికారులు తెలిపారు. పాట్నాసివిల్ కోర్టు న్యాయవాది అంషుమన్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా బార్ అసోసియేషన్ (డిబిఏ) గురువారం సమావేశమై చర్చించనుందని తెలిపారు. అందిన సమాచారం ప్రకారం, కోర్టు ఈరోజు మూసివేసినట్లు చెప్పారు. ఇది చాలా బాధాకరం. పరిస్థితి ఎంత తీవ్రమో స్పష్టంగా తెలియడం లేదు. ఇలాంటి సంఘటనలు కొనసాగితే న్యాయ ప్రక్రియ ఎలా సాగుతుంది? ప్రభుత్వానికి ఆదాయ నష్టం, న్యాయవాదులకు ఇబ్బందులు, సాధారణ ప్రజలకు నష్టాలు కలుగుతాయని ఆయన అన్నారు.
బుధవారం రాత్రి 1 గంటల సమయంలో జిల్లా సెషన్స్ జడ్జి కార్యాలయానికి వచ్చిన ఈమెయిల్‌లో కోర్టు సముదాయంలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థం అమర్చినట్లు ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ ప్రజల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నాయి.
పాట్నా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) భాను ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, కోర్టు సముదాయం అంతటా సమగ్ర తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. అవసరమైన తదుపరి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో కూడా పాట్నా సివిల్ కోర్టుకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇప్పటికే ఆరుసార్లు
ఇప్పటి వరకు ఒక ఏడాది వ్యవధిలో పాట్నా సివిల్ కోర్టుకు కనీసం ఆరు సార్లు బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు అందినట్లు తెలుస్తోంది, ఇవన్నీ ఆధారలేని హెచ్చరికలే అని పోలీసులు చెప్పారు. ఈ బెదిరింపుల కారణంగా కోర్టు పని సమయాల్లో తరచుగా అటంకం కలుగుతోంది. బెదిరింపు మెసేజ్‌లు ఎక్కువగా ఈ-మెయిల్ ద్వారా వస్తున్నాయి. దీంతో సందేశం పంపిన వ్యక్తిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పోలీసులు, సైబర్ సెల్, యాంటీ-టెర్రర్ బృందాలు దర్యాప్తు చేస్తున్నా, ఈ–మెయిల్ సెంటర్స్ నుంచి స్పష్టమైన ఐపీ ట్రేస్ ఇంకా అందలేదు.
