
పాట్నాలో కలకలం.. సమ్రాట్ చౌదరి సీఎం పోస్టర్లు
బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ గురువారం పాట్నాలోని బీజేపీ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. ఇదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పాట్నాలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం బయట ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే వాటిలో కొన్నింటిని పార్టీ సిబ్బంది తొలగించారు. ఈ పోస్టర్లపై ‘వాల్మీకి సమాజ్’ అనే దళిత సంఘం పేరు ఉండటం గమనార్హం. ఈ పోస్టర్లను ఎవరు పెట్టారో తెలియదని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి డానిష్ ఎక్బాల్ తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం పార్టీ సంప్రదాయం ప్రకారం సమష్టిగా తీసుకునే నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే వారం చివరిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వేగంగా రాజకీయంగా ఎదిగిన సమ్రాట్ చౌదరి
బీజేపీలో సీఎం పదవికి పోటీ పడుతున్న నేతల్లో సమ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభావవంతమైన ఓబీసీ వర్గమైన కోయరీ సమాజానికి చెందిన ఆయన పదేళ్లలోనే బీజేపీలో వేగంగా ఎదిగారు. 2023లో ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించగా, ఏడాది తర్వాత ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీయే విజయం సాధించిన తర్వాత చౌదరి మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయనకు కీలకమైన హోం శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు.
243 స్థానాల బీహార్ అసెంబ్లీలో బీజేపీ ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉంది. ‘ఖర్మాస్’గా పిలిచే నెలరోజుల ప్రతికూలమైన హిందూ కాలం ఏప్రిల్ 14తో ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యే అవకాశముందని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం పదవికి సమ్రాట్ చౌదరీనే ప్రధాన ఎంపికగా భావిస్తున్నప్పటికీ, తుది నిర్ణయం బీజేపీ ఉన్నత నాయకత్వం తీసుకుంటుందని, అనూహ్య నిర్ణయం కూడా ఉండవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్డీయేలో ముఖ్య భాగస్వామిగా బీజేపీ సమావేశాలు నిర్వహించడం సహజమని చెప్పారు. అయితే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే సమయంలో నితీశ్ కుమార్ అభిప్రాయం కూడా తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే నితీశ్ కుమార్ రాష్ట్రానికి మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారని తెలిపారు.
