
పాక్ స్పిన్‌కు భారత మిడిల్ ఆర్డర్ సమాధానమిస్తుందా?
ఐసీసీ మెన్స్ టీ–20 వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికర పోరుకు నేడు కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికకానుంది. భారత్–పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం దాయాదులు మధ్య ఆట ఆసక్తిగా ఉండనుంది. క్రికెట్‌తో పాటు రాజకీయ ఉద్రిక్తతలు ముసురుకున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌పై దక్షిణాసియా మొత్తం దృష్టి కేంద్రీకరించింది. భారత్ తో మ్యాచ్ లను బహిష్కరించాలని వేడుకున్న పాక్, తన వైఖరి నుంచి వెనక్కి తగ్గి బరిలోకి దిగేందుకు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గాయి.
అభిషేక్ ఫిట్‌నెస్‌పై దృష్టి
భారత జట్టుకు ఓపెనర్ అభిషేక్ ఫిట్‌నెస్ కీలకాంశంగా మారింది. నమీబియాతో మ్యాచ్‌కు ముందు అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం నెట్‌లో విస్తృతంగా బ్యాటింగ్ చేయడం ఊరటనిచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మీరు అనుకుంటే అభిషేక్‌ను ఆడిస్తాం అని వ్యాఖ్యానించినప్పటికీ, ఆయన తుది జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అభిషేక్ తిరిగి ఓపెనింగ్‌కు వస్తే సంజూ శాంసన్ కు చోటు దక్కకపోవచ్చు. పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని లెఫ్ట్ హ్యండ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే ఆలోచన కూడా ఉంది. గతంలో బాబర్ ఆజంపై మంచి రికార్డు ఉన్న కుల్దీప్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. అయితే అతనికి అవకాశం ఇవ్వాలంటే మరో బ్యాటర్‌ను తప్పించాల్సి ఉంటుంది. కుల్దీప్కు అవకాశం ఇస్తే రింకూసింగ్ మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
మిడిల్ ఆర్డరే కీలకం
వరల్డ్ కప్‌కు ముందు భారత బ్యాటింగ్ లైనప్ బుల్డోజర్‌లా కనిపించింది. కానీ ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్లు వరుసగా కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. యుఎస్ఏ, నమీబియా మ్యాచ్‌ల్లో మధ్యలో కూలిపోయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్,ఇషాన్ కిషన్, హర్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే భారీ టోర్నీలో వ్యక్తిగత ప్రతిభపై మాత్రమే ఆధారపడడం ప్రమాదకరం. పాకిస్తాన్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కోవాలంటే సమష్టి ప్రదర్శన అవసరం.
పాకిస్తాన్ స్పిన్ బెదిరింపు
పాకిస్తాన్ జట్టు ఇప్పటికే కొలంబోలోనే ఉండటంతో పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. నెమ్మదిగా తిరిగే పిచ్‌పై ఉస్మాన్ తారిక్, అబ్రార్ ఆహ్మద్ , షాదాబ్ ఖాన్, ముహమ్మద్ నవాజ్, సయం ఆయూబ్ వంటి ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. తారిక్ ప్రత్యేక బౌలింగ్ యాక్షన్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. బ్యాటింగ్ విభాగంలో షాహిబ్జాదా ఫర్హాన్ , అయూబ్, ఫహీం అష్రాప్ వంటి ఆటగాళ్లు ఏ రోజైనా మ్యాచ్‌ను తారుమారు చేసే సామర్థ్యం కలవారు. గత ఆసియా కప్‌లో జస్ప్రీత్ బుమ్రా ను సమర్థంగా ఎదుర్కొన్న ఫర్హాన్ మళ్లీ సవాల్ విసరనున్నాడు.
భారత్ బౌలింగ్ బలం
భారత్ వద్ద బుమ్రా నుంచి వరుణ్ చక్రవర్తి వరకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఆల్‌రౌండర్ శివం దుబే ఇటీవలి కాలంలో బౌలింగ్‌లో మెరుగుపడ్డాడు. ఈ కాంబినేషన్ ఎంపికలో జట్టుకు ప్రయోజనం కలిగిస్తోంది.
అయితే అన్ని లెక్కలు పక్కన పెడితే, ఈ పోరు మానసిక స్థైర్యం పరీక్షగా నిలవనుంది. బయటి ఒత్తిడులు, అభిమానుల అంచనాలు, వర్ష సూచనలు—వీటన్నింటి మధ్య ప్రశాంతంగా ఆడగల జట్టే గెలుపు దిశగా అడుగులు వేయగలదు. శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం సాయంత్రం వర్షం పడే అవకాశం 70 శాతం వరకు ఉందని తెలిపింది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
