
పాక్ సైనిక స్థావరాలపై అఫ్గాన్ మెరుపు దాడులు
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పాక్ సైన్యం ఇటీవల కాబూల్, బా గ్రామ్ ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్ వాయుసేన సోమవారం భీకర దాడులతో విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని అత్యంత కీలకమైన రావల్పిండిలోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్షిపణి దాడులు చేపట్టింది. అత్యంత సమన్వయంతో, కచ్చితత్వంతో జరిపిన ఈ వైమానిక చర్యల్లో పాక్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని అఫ్గాన్ అధికారికంగా ప్రకటించింది.
పాక్ సైనిక కేంద్రాలే లక్ష్యంగా..
అఫ్గాన్ రక్షణ శాఖ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడులు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. రావల్పిండిలోని వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌తో పాటు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని 12వ డివిజన్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని మొహ్మద్ ఏజెన్సీలో ఉన్న 'ఖ్వాజాయ్' సైనిక క్యాంపుపై అఫ్గాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. వీటితో పాటు పాకిస్థాన్ వ్యాప్తంగా ఉన్న మరికొన్ని వ్యూహాత్మక కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లు అఫ్గాన్ పేర్కొంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. తాము లక్ష్యంగా చేసుకున్న అన్ని సైనిక కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాబూల్ యంత్రాంగం స్పష్టం చేసింది.
సరిహద్దుల్లో ముదిరిన ‘బహిరంగ యుద్ధం’
గత శుక్రవారం కాబూల్, కందహార్ నగరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. సరిహద్దు దళాలపై అఫ్గాన్ దాడులు చేసిందన్న నెపంతో ఇస్లామాబాద్ వారం రోజుల క్రితమే అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వంపై ‘బహిరంగ యుద్ధం’ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాక్ యుద్ధ విమానాలు అఫ్గాన్ గగనతలంలోకి చొరబడి దాడులు చేశాయి. దీనికి దీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించిన అఫ్గాన్, తాజాగా పాక్ గుండెకాయ వంటి రావల్పిండిపై దాడులు చేసి తన సత్తా చాటింది.
అఫ్గాన్ గట్టి హెచ్చరిక
తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా పాక్ సైన్యం వ్యవహరిస్తోందని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మండిపడింది. తమ గగనతలాన్ని ఇకపై ఏమాత్రం అతిక్రమించినా లేదా దురాక్రమణకు పాల్పడినా మరింత వేగంగా, నిర్ణయాత్మకమైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఉధృతం కావడంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ పరిణామాలు దక్షిణాసియాలో మరో యుద్ధానికి దారితీస్తాయేమోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
