Let's talk: editor@tmv.in
పాక్ సమాచారంతో కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది: అస్సాం సీఎం

పాక్ సమాచారంతో కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది: అస్సాం సీఎం

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

తన భార్యకు అనేక పాస్‌పోర్టులు ఉన్నాయని, దుబాయ్‌లో ఆస్తులు ఉన్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలు పాకిస్థాన్‌కు చెందిన ఒక సోషల్ మీడియా గ్రూప్‌లోని తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

గువాహటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన శర్మ, కాంగ్రెస్ నేతలు పవన్‌ఖేరా, గౌరవ్‌గోగోయ్‌ తన భార్య, కుటుంబ సభ్యులకు దుబాయ్‌లో ఆస్తులు, అమెరికాలోని వైయోమింగ్ రాష్ట్రంలో కంపెనీలు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇది చట్టపరంగా శిక్షార్హమైన నేరమని అన్నారు.

ఎన్నికలపై ప్రభావం చూపేందుకే

భార్యపై ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ ఉపయోగించిన పత్రాలు ‘పాకిస్థానిస్‌ ఇన్‌ అజ్మన్‌’ అనే పాకిస్థాన్ సోషల్ మీడియా గ్రూప్ నుంచి తీసుకున్నవని హిమంత ఆరోపించారు. ఆ దేశంలో పోయిన పాస్‌పోర్ట్‌పై తన భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారని తెలిపారు. అస్సాం ఎన్నికలపై ప్రభావం చూపేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని కూడా ఆరోపించారు. కనీసం 11 టీవీ చర్చల్లో కాంగ్రెస్ గెలవాలని ఒకే విధమైన కథనం ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై తన భార్య రింకి భుయాన్‌ శర్మ ఇప్పటికే పవన్ ఖేరాపై ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌గోగోయ్‌ కుమారుడు గౌరవ్ గోగోయ్ ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

మేం కూడా ఓ నకిలీ కంపెనీ సృష్టించాం

అంతర్జాతీయ లావాదేవీలు చేసే క్రెడిట్ కార్డు ఉన్న ఎవరైనా అమెరికాలోని వైయోమింగ్ రాష్ట్రంలో వెబ్‌సైట్ ద్వారా కంపెనీ నమోదు చేయవచ్చని హిమంత చెప్పారు. మేము కూడా గౌరవ్ గోగోయ్‌, ఆయన భార్య పేరుతో ఒక నకిలీ కంపెనీని సృష్టించామని పేర్కొన్నారు. మేం 199 డాలర్లు చెల్లించి ‘గౌరవ్‌ ఎలిజబెత్‌786 లిమిటెడ్‌ లయబిలిటీ ఎల్‌ఎల్‌సీ’ అనే కంపెనీని నమోదు చేశాం. ఈరోజు సాయంత్రానికి అది వెబ్‌సైట్‌లో కనిపిస్తుందని ఆయన అన్నారు. యూఏఈ పాస్‌పోర్ట్ ఆరోపణలపై స్పందిస్తూ, యూఏఈ దేశం పాస్‌పోర్ట్ ఇవ్వదని, కేవలం ‘గోల్డెన్ వీసా’ అనే 10 సంవత్సరాల దీర్ఘకాలంపాటు నివాసం ఉండేందుకు అనుమతిని మాత్రమే ఇస్తుందని హిమంత తెలిపారు. ఇది పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నిపుణులు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇచ్చే నివాస కార్యక్రమమని ఆయన వివరించారు.