Let's talk: editor@tmv.in
పాక్‌ వైమానిక దాడిలో అఫ్గాన్‌ క్రికెటర్ల మృతి

పాక్‌ వైమానిక దాడిలో అఫ్గాన్‌ క్రికెటర్ల మృతి

Shaik Mohammad Shaffee
19 అక్టోబర్, 2025

అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్‌ జిల్లాపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపగా, ఈ ఘటనలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లతో సహా మొత్తం ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ధృవీకరించింది.

పాక్టికా రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా, ఉర్గున్‌కు చెందిన యువ క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూన్ ఈ దాడిలో మరణించారని ఏసీబీ తెలిపింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ పిరికిపంద చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల గౌరవార్థం కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెలలో శ్రీలంక, పాకిస్థాన్‌తో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి వైదొలగనున్నట్లు ఏసీబీ ప్రకటించింది. "పాకిస్థాన్ కూడా ఈ సిరీస్‌లో పాల్గొంటున్నందున మేము వైదొలగుతున్నాం" అని ఏసీబీ స్పష్టం చేసింది. ఈ దుర్ఘటన అఫ్గానిస్థాన్ క్రీడా కుటుంబానికి తీరని లోటని పేర్కొంది.

రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

ఈ పాక్ దుశ్చర్యపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. సీనియర్ ఆటగాడు, వన్డే కెప్టెన్ రషీద్ ఖాన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. "పాకిస్థాన్ వైమానిక దాడుల్లో అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం దారుణం. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం. దేశ గౌరవమే అన్నింటికంటే ముందు ఉండాలి. అందుకే సిరీస్ నుంచి తప్పుకోవాలనే ఏసీబీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను" అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. మరో అంతర్జాతీయ ఆటగాడు గుల్బదిన్ నయిబ్ కూడా పాకిస్థాన్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ వరుస దాడులతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి.

పాక్‌ వైమానిక దాడిలో అఫ్గాన్‌ క్రికెటర్ల మృతి - Tholi Paluku