
పాక్ వన్డే కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పుల పర్వం మళ్లీ తెరపైకి వచ్చింది. నిలకడ లేని ప్రదర్శనల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను తప్పించి, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి జట్టు పగ్గాలు అప్పగించింది. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జాతీయ సెలక్టర్లు, సలహా మండలి సభ్యులు, హెడ్ కోచ్ హెస్సన్ హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.
కెప్టెన్‌గా అఫ్రిది తొలి అడుగు
కొత్త వన్డే కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది నవంబర్ 4 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో తన బాధ్యతలను ప్రారంభించనున్నాడు. ఈ సిరీస్ ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో జరగనుంది. 25 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 400కు పైగా వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు కెప్టెన్సీ అదనపు బాధ్యతలను ఎలా మోస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
రిజ్వాన్‌పై వేటుకు కారణాలు
కెప్టెన్సీ మార్పుకు పీసీబీ ఎలాంటి అధికారిక కారణం చూపనప్పటికీ, హెస్సన్ సిఫారసే ఈ మార్పుకు ప్రధాన కారణంగా అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. వైట్-బాల్ హెడ్ కోచ్‌గా మే నెల చివర్లో బాధ్యతలు చేపట్టిన హెస్సన్, రిజ్వాన్‌తో కలిసి కేవలం ఒక్క వన్డే సిరీస్‌లో (వెస్టిండీస్‌తో) మాత్రమే పనిచేశారు.
క్రికెట్ విశ్లేషకుడు ఒమైర్ అలవి మాట్లాడుతూ.. రిజ్వాన్‌కు 45 శాతం విజయాల రికార్డు ఉన్నప్పుడు, అలాగే ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలలో వన్డే సిరీస్‌లు గెలిచినప్పుడు, కేవలం ఒక్క సిరీస్‌తోనే హెస్సన్ అతడి కెప్టెన్సీ గురించి ఒక అభిప్రాయానికి రావడం విచిత్రంగా ఉందన్నారు. రిజ్వాన్ సారథ్యంలో పాకిస్తాన్ 20 వన్డేలు ఆడి 9 గెలిచి, 11 ఓడిపోయింది. ఇందులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లలో సిరీస్ ఓటములు ఉన్నాయి.
డ్రెస్సింగ్ రూమ్‌లో మత ప్రస్తావనలు?
ఈ కెప్టెన్సీ మార్పుకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చని పాక్ క్రికెట్ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ చర్చలలో రిజ్వాన్ "మతాన్ని ఎక్కువగా ప్రస్తావించడం" పట్ల కొందరు బోర్డు అధికారులు అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కొంతమంది ఆటగాళ్లకు కూడా ఇబ్బంది కలిగించినట్లు సమాచారం.
రిజ్వాన్ తరచూ మత విశ్వాసాలను వ్యక్తపరుస్తుంటాడు, క్రికెట్ మ్యాచ్‌లలో, మీడియా సంభాషణలలో కూడా మతపరమైన అంశాల గురించి మాట్లాడటానికి వెనుకాడడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇమామ్ ఉల్ హక్ ప్రకారం, రిజ్వాన్ టీమ్ హోటల్స్‌లో ప్రత్యేక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆటగాళ్లను రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయమని కోరేవాడు. 2004-2007 మధ్యకాలంలో మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో మతంపై దృష్టి పెట్టడం అప్పటి ఛైర్మన్ దివంగత షాహర్యార్ ఖాన్‌కు ఇబ్బంది కలిగించిన సందర్భాన్ని ఈ పరిస్థితి గుర్తు చేస్తోంది.
రిజ్వాన్‌ను తొలగించాలనే నిర్ణయం వెనుక హెస్సన్ ఒక్కరే కాదు, సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారని నివేదికలు పేర్కొన్నాయి. హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ సలహా మండలిలో ఉన్న ఇద్దరు మాజీ కెప్టెన్లు సర్ఫరాజ్ అహ్మద్, మిస్బా-ఉల్-హక్ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్‌లో గత రెండేళ్లుగా కెప్టెన్సీ మార్పులు తరచూ జరుగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 ప్రపంచ కప్ తర్వాత బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత స్వల్పకాలికంగా షాహీన్ అఫ్రిది టీ20 కెప్టెన్‌గా, మహమ్మద్ రిజ్వాన్ వన్డే కెప్టెన్‌గా నియమితులయ్యారు. అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఓటమి తర్వాత షాహీన్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించారు. తాజాగా, రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు సల్మాన్ అలీ ఆఘా (ఇతడిపైనా వేటు వేసే యోచనలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి), వన్డేలకు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. నిలకడలేని కెప్టెన్సీ మార్పుల వల్ల జట్టు ప్రదర్శనపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షాహీన్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ఎంతవరకు మెరుగుపడుతుందో చూడాలి.
