Let's talk: editor@tmv.in
పాక్‌ మూడు ముక్కలాట

పాక్‌ మూడు ముక్కలాట

FL - TRND
11 అక్టోబర్, 2025

1947.. ఒక దేశం రెండు ముక్కలైంది..! ఒకటి ఇండియా.. ఇంకోటి పాకిస్థాన్‌.. రెండూ నెత్తుటితో గాయపడ్డ దేశాలే.. కానీ భారత్‌ ఆ గాయాలను కాలంతో నయం చేసుకుంది. అటు పాకిస్థాన్‌ మాత్రం ఆ గాయాలపై కారం చల్లుకుంది. గాయం తీవ్రతను మరింత పెంచుకుంది. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీతో పాక్‌ వైరం కొనసాగుతుండగా.. మరోవైపు తెహ్రీక్-ఇ-తాలిబాన్ సంస్థ పాకిస్థాన్‌ ఆర్మీని టార్గెట్ చేసింది. 11మంది పాక్‌ జవాన్లను చంపేసింది. అంతకు ముందు రోజే జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై బలూచ్‌ మిలిటెంట్లు దాడికి దిగారు. ఇలా జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను బలూచ్‌ టార్గెట్ చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి.

ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల రెండు వేర్వేరు దాడులు చేసినట్టు ప్రకటించింది. ఒకటి పాక్‌ పారా మిలటరీ సిబ్బందిపై జమ్రాన్‌లో బాంబు దాడి, మరొకటి హబ్‌లోని వనరుల మైనింగ్‌ కంపెనీపై అగ్ని దాడి. ఇక బలూచిస్తాన్ స్వాతంత్రం సాధించే వరకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాకిస్థాన్ చరిత్రలో నిశ్శబ్దం అనే పదానికి స్థానం లేదనే రీతిలో భయానక దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి. అయితే ఈ వరుస దాడులు హఠాత్తుగా పుట్టినవి కాదు. ఈ దాడుల వెనుక ఒక కథ ఉంది. ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న వారి దీన వేదన ఉంది.. ఇలా ఎందుకు జరుగుతుందో నేను మీకు వివరిస్తా.. వీడియో చివరి వరకు చూడండి. పాకిస్థాన్‌ మూడు ముక్కలగా ఎందుకు విడిపోనుందో మీకే అర్థమవుతుంది!

ఇప్పుడంతా బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించే మాట్లాడుకుంటున్నారు. 2025 మార్చిలో వందలాది మంది ప్రయాణికులు వెళ్తున్న రైలును బలూచ్‌ ఆర్మీ హైజాక్ చేసిన తర్వాత ఈ గ్రూపు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2001 నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రహస్య భయానక శక్తిగా ఎదిగింది. ఈ గుంపు లక్ష్యం ఒక్కటే..! 'బలూచిస్థాన్‌కు స్వాతంత్రం కావాలి..'! ఇదే వారి టార్గెట్‌. ఈ లక్ష్యం కోసం పాక్‌ ఆర్మీ మీద దాడులు చేస్తుంటారు. బాంబులతో రైళ్లను పేల్చుతుంటారు. మార్చిలో జరిగిన ఘటన అయినా నిన్నగాక మొన్న జరిగిన ఘటన అయినా అందుకోసమే. పోలీసులు, సైనికులపై పగా-ప్రతీకారాలతో రగిలిపోయే బలూచ్‌ మిలిటెంట్లు పలు సందర్భాల్లో సామాన్యులను సైతం పొట్టన పెట్టుకున్నారు. బలూచిస్తాన్‌లో అక్రమ అరెస్టులు ఆపాలని.. తమ నేతలను విడుదల చేయాలని నిత్యం హింసాత్మక చర్యలకు దిగుతుంటారు. ఇంతకీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎందుకిలా చేస్తోంది? అది కేవలం క్రూరత్వమా? ఇది అర్థంకావలంటే బలూచిస్థాన్‌ భూభాగం గురించి ముందుకు అర్థం చేసుకోవాలి.

బలూచిస్థాన్... ప్రకృతి వరించిన నేల. ఒకవైపు ఎడారుల వెనుక అంతులేని నల్ల మట్టి.. మరోవైపు కొండల వెనుక దాగిన అశేష ఖనిజ సంపద. భూమిలో పొదిగిన నల్ల బంగారం..! అటు గ్యాస్, ఇటు ఆయిల్ రిజర్వులు, బంగారం, లౌహాలు, కోబాల్ట్‌, యురేనియం.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో సంపదలు దాగున్న నేల అది. పాకిస్థాన్‌ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 45శాతం భూభాగం బలూచిస్థాన్‌దే! కానీ అక్కడి జనాభా దేశ మొత్తం జనాభాలో 5శాతం మాత్రమే. పాకిస్థాన్‌కు అవసరమైన ప్రధాన గ్యాస్ రిజర్వుల్లో 40శాతం బలూచ్‌లోనే ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు గ్యాస్ లైటర్ల వెలుతురుకు కూడా దూరంగా ఉన్నారని తెలుసా? బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్ గురించి విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన వాణిజ్య మార్గం అది. చైనా, ఇరాన్, సెంట్రల్ ఏషియా దేశాలకు తలుపులు తెరచే ద్వారం అది. ఈ పోర్ట్‌ను చైనా అభివృద్ధి చేసింది. దీనిపై వచ్చే లాభాల్లో బలూచ్ ప్రజలకు పైసా కూడా రాదు. ఆ నౌకాశ్రయాన్ని ముట్టుకోవడానికి కూడా బలూచ్‌ ప్రజలకు హక్కులేదు. ఒక్కమాటలో చెప్పాలంటే వారి భూమిలోనే వాళ్లు పరాయివారైపోయారు! ఇంతటి అన్యాయాల మధ్య బతుకీడుస్తున్న వారిలో వేర్పాటువాద ఆలోచనలు ఎందుకు పుట్టవు? అందుకే ప్రత్యేక బలూచిస్థాన్‌ కావాలన్న డిమాండ్‌ పుట్టింది. అది పుట్టగానే పాక్‌ రాజ్యం ఊరుకుంటుందా..? సైనికులను పంపింది. ఎన్నో క్రూరతి క్రూరమైన హత్యలు చేయించింది.

మీరు గమనిస్తే బలూచిస్థాన్‌లోని గ్రామాలు సైనిక శిబిరాలుగా మారిపోయి ఉంటాయి. గుహల లోపల, నిర్జీవమైన భవనాల్లో, సముద్ర తీరాల్లో నరకం అనుభవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యువకులను ఎత్తుకుపోవడం, మహిళలను లాఠీలతో కొట్టడం, చిన్నారుల కళ్ల ముందు తండ్రులను కాల్చివేయడం లాంటి ఘటనలు అక్కడ ఎన్నో సార్లు కనిపించాయి. పాక్‌ ఆర్మీ అణిచివేతపై ఎవరైనా నిరసనకు దిగితే.. రాత్రికి రాత్రే వారిని కిడ్నాప్ చేసి ఎక్కడో పడేసేవారు. అయినా కూడా ఎదురుతిరిగితే వాళ్ల పని ఖతం. కొన్నిరోజులకు ఎక్కడో ఒక చోట కుళ్లిపోయిన శవం కనిపించేది. ఇటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘలు ఎన్నోసార్లు బలూచిస్థాన్‌లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. బలూచ్‌ నేతలను కిడ్నాప్‌ చేసి పాక్‌ ఆర్మీ హింసపెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదంతా బలూచిస్థాన్‌ వేర్పాటవాదుల కథ.. అయితే పాక్‌ వేర్పాటువాదం కేవలం బలూచ్‌తోనే ఆగడంలేదు. మరో రెండు ప్రాంతాలు కూడా పాక్‌ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి. అటు పశ్తూనిస్తాన్ కావాలని కొందరు ఇటు సింధుదేశం కోసం మరికొందరు పాక్‌ ఆర్మీతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు.

పాక్‌లోని పశ్తూన్లు తమను అఫ్ఘానిస్థాన్‌తో కలపాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు తాలిబాన్లకు అడ్డాగా మారిన ఆ ప్రదేశం.. ఇప్పుడు పశ్తూనిస్థాన్‌గా తమను గుర్తించి పాక్‌ నుంచి విడగొట్టాలని కోరుకుంటోంది! అందుకే పశ్తూన్లు ఉన్న ప్రాంతాల్లో కూడా తుపాకీ శబ్దం రోజూ మోతమోగుతుంది. తాలిబాన్లు, పాక్ ఆర్మీ, స్థానిక గ్యాంగ్‌లు.. ఇలా ఎవరు ఎవరిని వేటాడుతున్నారో తెలియదు. కానీ ప్రతి ఇంటిలోనూ భయమే కనిపిస్తుంది. పశ్తూన్ భూమిని కూడా పాకిస్తాన్ సైన్యం తన నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు సింధ్ ప్రజలు కూడా తమ భూమికి స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాకిస్థాన్‌ మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది. ప్రతి రోజూ కొత్త నరకపు దారులు పుట్టుకొస్తున్నాయి. ఎవరు ఏం అడుగుతారో, ఎప్పుడు తిరగబడతారో ఎవరికి అర్థంకాదు. అక్కడ కాలం కూడా రక్తంలో తడిసిన గడియారంలా మారింది. ప్రతి నిమిషం ఒక బాంబు పేలతుంది.. ప్రతి గంటా, ఒక పౌరుడు గల్లంతవుతున్నాడు.. ప్రతి రోజు, ఒక మాతృ గుండె తల్లడిల్లతుంది.. ఇది పాకిస్థాన్‌ భవిష్యత్తు.. ఇది పాకిస్థాన్‌ రక్త గాథ!

పాక్‌ మూడు ముక్కలాట - Tholi Paluku