
పాక్ మాట్లాడేవన్నీ కల్లబొల్లి మాటలే!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి భారత వైమానిక దళం చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణ సందర్భంగా నాలుగు నుంచి ఐదు పాకిస్తానీ ఫైటర్ జెట్‌లను భారత వైమానిక దళం కూల్చివేసినట్లు ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, భారత వైమానిక దళం అనేక పాకిస్థానీ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని తెలిపారు. ఈ దాడుల వల్ల పాకిస్థాన్‌కు జరిగిన నష్టాల గురించి వివరిస్తూ ఆయన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
భారత వైమానిక దళం కూల్చివేసిన వాటిలో అమెరికా తయారుచేసిన ఎఫ్-16లు, చైనా తయారుచేసిన జేఎఫ్-17 రకానికి చెందిన యుద్ధ విమానాలు ఉన్నట్లు తెలిపారు. ఎఫ్-16లు ఉన్న స్థావరంపై భారత సైన్యం దాడి చేయడం వల్ల.. మెయింటెనెన్స్ కోసం ఉన్న విమానాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. తాము పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపిన ఐఏఎఫ్ చీఫ్, ఈ దాడుల వల్ల నాలుగు ప్రాంతాల్లోని రాడార్లు, రెండు చోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లు, రెండు వైమానిక స్థావరాల రన్‌వేలు, అలాగే మూడు వేర్వేరు స్టేషన్లలోని మూడు హ్యాంగర్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక సీ-130 విమానం, సుదూర నిఘా కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన విమానం కూడా దెబ్బతిన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఒక సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ కూడా ధ్వంసమైందని ఆయన అన్నారు.
భారత యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను ఐఏఎఫ్ చీఫ్ కొట్టిపారేశారు. పాకిస్థాన్ భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. అయితే భారత్ మాత్రం పాకిస్థానీ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాల గురించి తెలిపే చిత్రాలను విడుదల చేసిందని గుర్తుచేశారు. పాక్ కేవలం తమ పరువు కాపాడుకోవడానికి, తమ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇలాంటి వాదనలు చేస్తోందని ఆయన అన్నారు.
భవిష్యత్తు భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, ‘సుదర్శన చక్ర’ గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పని చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. భారతీయ వైమానిక దళం యొక్క ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి మాట్లాడుతూ... తొలి విమానం 2028 నాటికి ఎగురుతుందని, 2035 నాటికి వైమానిక దళంలో చేరి, పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో కొత్త యుద్ధ విమానాల సేకరణలో భాగంగా ఎస్‌యూ-57, రఫేల్ వంటి అన్ని ఎంపికలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. గతంలో జరిగిన మధ్యస్థ మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒప్పందం సమయంలో రఫేల్ ఉత్తమమైన విమానంగా గుర్తించబడిందని, కాబట్టి ఇది కొత్త ఫైటర్ జెట్‌లకు ప్రధాన ఎంపికలలో ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పాక్ ఉగ్రవాద స్థావరాలపై స్పందన
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాద గ్రూపులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయనే నివేదికలపై ఐఏఎఫ్ చీఫ్ స్పందించారు. విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందుబాటులో ఉంటే, అలాంటి స్థావరాలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా ఆపరేషన్ సిందూర్ ఐఏఎఫ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన, విజయవంతమైన దాడిగా ఐఏఎఫ్ చీఫ్ అభివర్ణించారు. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ క్షిపణి దాడికి గుర్తుగా ఈ ఆపరేషన్ నిలిచిందని తెలిపారు.
యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని ఈ సందర్భంగా భారత వాయుసేన అధిపతి అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. నిర్దిష్ట లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి భారత్ త్వరగానే దాన్ని ముగించిందని అన్నారు. త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సిందూర్ ప్రతిబింబమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని తెలిపారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ మెరుగ్గా పని చేసిందని వివరించారు.
"ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న రెండు యుద్ధాలకు ముగింపు గురించి మాట్లాడట్లేదు. కానీ మేము వారిని (పాకిస్థాన్‌ను) ఒక దశకు తీసుకురాగలిగాం. అక్కడ వారు కాల్పుల విరమణ కోసం, శత్రుత్వాల ముగింపు కోసం అడిగారు. మా లక్ష్యాలు నెరవేరాయి కాబట్టి, మేము ఆ శత్రుత్వాలను ముగించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచం మన నుండి నేర్చుకోవలసింది ఇదేనని నేను భావిస్తున్నాను” అని ఆయన ముగించారు.
